ఏపీలో అధికారం దక్కించుకునేందుకు టీడీపీ, వైసీపీ ప్రధానంగా పోటీ పడుతున్నాయి.ఆ రేస్ లో తానూ ఉన్నానని జనసేన అధినేత పవన్ కూడా పలు సందర్భాల్లో ప్రకటించాడు.
ప్రస్తుతం అభ్యర్థులను ప్రకటిస్తూ అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.కాకపోతే టీడీపీ, వైసీపీ రాజకీయ బలం ముందు జనసేన వీక్ గానే ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం అన్ని పార్టీల నుంచి నాయకులంతా కేవలం అసెంబ్లీకి మాత్రమే పోటీ చేయాలనీ చూస్తున్నారు తప్ప పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది.పార్లమెంట్ తరపున పోటీ చేయించేందుకు అభ్యర్థులను బతిమిలాడాల్సిన పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలకు తలెత్తింది.

ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ పార్లమెంట్ సీట్ల విషయంలో లైట్ తీసుకుంటోంది.పవన్ కూడా తన కోటరీ నాయకులందరికీ ఎమ్యెల్యే సీట్లు మాత్రమే ఇచ్చాడు.జనసేన పార్టీ కీలక నాయకుల్లో ఒకరైన తోట చంద్రశేఖర్ ను గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ ప్రకటించారు.ఇది అనూహ్య పరిణామంగా పార్టీలోనే చర్చ జరుగుతోంది.
తోట చంద్రశేఖర్.ఇతర రాష్ట్రాలలో కూడా సేవలందించిన సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారిగా గుర్తింపు ఉన్నవారు.
గతంలో చిరంజీవి ప్రజారాజ్యం తరఫున, తర్వాత వైసీపీ తరఫున కూడా ఎంపీగా పోటీచేసిన అనుభవం ఆయనకు ఉంది.జనసేనలో చేరిన తర్వాత పార్టీకోసం 99 టీవీ న్యూస్ ఛానెల్ ను కూడా కొన్నారు.
లాభాలు రాకపోయినా ఆ ఛానెల్ ను రాజకీయ అవసరాల కోసం నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయన ఎంపీగా బరిలో ఉంటారని అంతా అనుకున్నారు.
కానీ ఆయనకు అసెంబ్లీ టికెట్ మాత్రమే దక్కింది.

ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులను ఒక్కసారి గమనిస్తే , మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉన్నట్టు కనిపిస్తున్నా అసలు ఫైట్ అంతా వైసీపీ, టీడీపీ మధ్యే కొనసాగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.అదీ కాకుండా జనసేన ఎంపీ సీట్లు గెలుచుకునే అంత బలం, బలగం ఉన్నట్టు కనిపించడంలేదు.అందుకే నా అనుకున్న వారందరికీ ఎమ్యెల్యే సీట్లు కేటాయిస్తూ ఎంపీ అభ్యర్థుల విషయంలో లైట్ తీసుకుంటున్నారు.
ఇప్పటికే పార్టీ తరపున కొంతమంది అభ్యర్థులను ప్రకటించినా సీరియస్ గా అయితే దృష్టిపెట్టలేనట్టుగానే కనిపిస్తోంది.ఎంపీ గా పోటీలో దిగితే పరిస్థితి గ్యారంటీ లేదని ఎమ్మెల్యేగా అయితే కాస్త కష్టపడితే ఫలితం దక్కుతుందని.
ఆ పార్టీ కీలక నాయకులే భావిస్తున్నట్టుగా అర్ధం అవుతోంది.







