ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో దీక్ష చేయాలని చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా… అమరావతిలోని చంద్రబాబు నివాసంలో ఈరోజు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ భేటీలో చంద్రబాబు ఢిల్లీ దీక్ష అంశం ప్రస్తావనకువచ్చినట్టు సమాచారం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకొచ్చేందుకు ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేస్తే ఎలా ఉంటుందననే అంశాన్ని చర్చించారని సమాచారం.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి.ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.ఎన్డీయే ఐదేళ్ల పాలనా కాలంలో ఇదే చివరి బడ్జెట్ కావడంతో ఈసారైనా రాష్ట్రానికి ఎక్కువ నిధులు సాధించుకోవడానికి పోరాడాలని భావిస్తున్నారు.ఈసారి కేంద్ర ప్రభుత్వం ఫుల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని చూస్తోందంటూ వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ కేంద్రం మధ్యంతర బడ్జెట్ కాకుండా ఫుల్ బడ్జెట్ పెడితే, అందులో రాష్ట్రానికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారో చూసి, ఆ తర్వాత దీక్ష చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.






