జనసేన పార్టీ పెట్టి ఈ మధ్యకాలంలో రాజకీయ దూకుడు పెంచిన పవన్ కళ్యాణ్ ను చూసి ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వణికిపోతున్నాయి.అంటే పవన్ వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సంపాదించుకుని అధికారం దక్కించుకుంటాడని కాదు పవన్ తక్కువ సంఖ్యలో సీట్లు సంపాదించినా అన్ని నియోజక వర్గాల్లోనూ ఓట్లర్లను ఖచ్చితంగా ప్రభావితం చేయగలడు ఇప్పుడు ఇదే భయం ప్రధాన పార్టీలకు పట్టుకుంది.
పవన్ చీల్చే ఓట్లు ఎవరికీ మేలు చేయబోతున్నాయి ఎవరికి కీడు చేయబోతున్నాయి అనే విషయం మీదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంత దూకుడుగానే వెళుతున్నారు.ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే అక్కడకు వెళ్లి ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతున్నారు.వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేసి తన సత్తా చూపించాలని చూస్తున్నాడు.
జనసేన పోటీ చేస్తే ఎంతో కొంత ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.ఎందుకంటే పవన్ కు బలమైన సామాజిక వర్గంతో పాటు యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
ప్రభుత్వంపైనా, ప్రతిపక్షంపైనా పవన్ చేసే విమర్శలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి.
పవన్ బలపడితే ఏ పార్టీకి ఎక్కువ దెబ్బపడుతనదో తెలియక ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
పవన్ పార్టీకి ముఖ్యంగా రెండు వర్గాల ఓట్లు పడతాయన్నది అంచనా.ఒకటి కాపు సామాజిక వర్గం ఓట్లు కాగా, రెండోది యువ ఓటర్లు.
అయితే గత ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఓటర్లు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు.యువత జగన్ వైపు నిలిచింది.
కానీ ఈసారి రెండు వర్గాల ఓట్లను పవన్ ఒంటరిగా పోటీ చేసి చీల్చే అవకాశాలు ఉండటంతో ఇటు అధికార తెలుగుదేశం పార్టీకి, అటు వైసీపీకి నష్టమేనంటున్నారు.ఇక తెలంగాణ విషయానికొస్తే పవన్ పెద్దగా ఇక్కడ ఫోకస్ పెట్టకపోయినా పోటీకి దిగడం ఖాయమనే చెబుతున్నారు.
ఇది కేసీఆర్ కు లాభం చేకూరుస్తుందన్న అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు సెటిలర్లు ఉన్న ప్రాంతాల్లో పవన్ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు.తెలంగాణలో కాపు సామాజిక వర్గంతో పాటు సెటిలర్లు, యువత ఓట్లతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చగలిగితే అది తనకు లాభమని కేసీఆర్ భావిస్తున్నారు.