తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది.వచ్చే మూడు నెలల్లో మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్సీలతో పాటు కొత్త ఆశావాహుల తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
మార్చిలో ముందుగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు, మేలో మరో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.ఇందుకోసం సిట్టింగులు, సీనియర్లు, జూనియర్లు తమ ప్రయత్నాలు ప్రారంభించేశారు.
మార్చిలో ఖాళీ అయ్యే స్థానాల్లో మహబూబ్‌నగర్ – హైదరాబాద్ – రంగా రెడ్డి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలో కోటాలో ఎన్నికైన సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వి (ఎంఐఎం), ఎం.రంగారెడ్డి (కాంగ్రెస్), వి.గంగాధర్‌గౌడ్ (టీఆర్‌ఎస్) ఉన్నాయి.
ఇక మేలో హైదరాబాద్ లోకల్ బాడీస్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ, గవర్నర్ కోటాలో నామినేటైన డి.రాజేశ్వర్ (టీఆర్‌ఎస్), ఫరూక్ హుస్సేన్ (టీఆర్‌ఎస్) ఉన్నారు.ఈ ఏడు స్థానాలు గెలుచుకోవడం టీఆర్ఎస్‌కు నల్లేరుమీద నడకగానే మారింది.
ఎమ్మెల్సీ సీట్ల ఎంపిక విషయానికి వస్తే కాటేపల్లి జనార్థన్‌రెడ్డికి మరోసారి ఛాన్స్ ఇస్తారంటున్నా.ఈ స్థానానికి తీవ్ర పోటీ ఉన్నట్టు తెలుస్తోంది.
ఏడు సిట్టింగులలో నలుగురికి తిరిగి ఎమ్మెల్సీ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.ఇక గతంలో మండలిలో పట్టుకోసం టీఆర్ఎస్ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలను వరుసగా తన పార్టీలో చేర్చుకుంది.
ఇప్పుడు వారికి మరో ఛాన్స్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోందట.
టీడీపీ నుంచి ఎన్నికై టీఆర్‌ఎస్‌లో విలీనమైన సభ్యుల్లో ఒకరైన వి.గంగాధర్‌గౌడ్… గవర్నర్ కోటాలో నామినేటై కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన డి.రాజేశ్వర్, ఫరూక్ హుస్సేన్‌లకు తిరిగి అవకాశం ఇవ్వనున్నారని ఆ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.







