Prime Minister Narendra Modi: ప్రధానమంత్రి అబద్ధం ఆడితే ఎవరికి చెప్పాలి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామగుండం పెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేశాడు.

తదనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణ పూర్తిగా అబద్ధమని అని తేల్చిచెప్పాడు.

హైదరాబాద్ కేంద్రంగా రెచ్చగొడుతున్నారని ఆరోపించాడు.అయితే గతంలో జరిగిన మీడియా ఇంటర్వ్యూలో ప్రభుత్వ పరిశ్రమల భవిష్యత్తు గురించి మరియు ప్రభుత్వం అవలంభించే కార్యాచరణను కూడా ప్రకటించాడు.2014 మే26న ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత బొగ్గు పరిశ్రమలో ప్రైవేటీకరణ చర్యలు వేగిరమైనవి.పార్లమెంటు ఉభయ సభల్లో 2015 మార్చి 4 మరియు 20 తేదీల్లో బొగ్గు గనుల నిబంధనల ప్రత్యేక చట్టం 2015ను ఆమోదింపజేసి అక్టోబర్ 21 నుండి అమల్లోకి తెచ్చారు.ప్రభుత్వ బొగ్గు పరిశ్రమలైన కోల్ ఇండియా లిమిటెడ్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లకు అండగా ఉన్న 1973 బొగ్గు గనుల జాతీయకరణ చట్టంను 2018 జనవరి 8న రద్దు చేశారు.2019 ఫిబ్రవరి 20న ఆర్థిక వ్యవహారాల కేంద్ర మంత్రి వర్గ సంఘం పెద్ద,మధ్య,చిన్న స్థాయి బొగ్గుగనులను ప్రైవేటుకు ఇవ్వడానికి అనుమతించింది.2019 ఆగస్ట్ 28న కేంద్ర క్యాబినెట్ బొగ్గు రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించింది.2019 సెప్టెంబర్ 13న రెవెన్యూ ,బొగ్గు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు మరియు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ పాల్గొన్న సమావేశం బొగ్గు రంగాన్ని ప్రైవేటీకరించే సంస్కరణలను సిఫారసు చేసింది.సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2020 జూన్ 18న కమ్మర్షియల్ మైనింగ్ ప్రాతిపధికగా బొగ్గు తవ్వకాలకు 44 బొగ్గు బ్లాక్ లను కేటాయించడానికి వేలం పాటను ప్రారంభించాడు.

వేలం పాటలో బొగ్గు బ్లాక్ లను దక్కించుకున్న వారికి మౌళిక సదుపాయాల కల్ఫనకు 50,000 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించాడు.గనులు, ఖనిజాల సవరణ చట్టం 2021" ని మార్చి 15న ఆమోదింపజేసి, మార్చి 28 నుండి అమల్లోకి తెచ్చారు.

కేంద్ర ప్రభుత్వం 2014 నుండి బొగ్గు పరిశ్రమకు బడ్జెట్ సపోర్ట్ ను నిలిపివేసింది.కాని రాయల్టీ యితరత్రా పన్నుల రూపేణా మాత్రం వేల కోట్ల రూపాయలను పొందుచునే ఉన్నది.

Advertisement

ప్రభుత్వ బొగ్గు సంస్ధలు స్వంత వనరులతోని చేపట్టిన బొగ్గు తవ్వకాలను కూడా నిరాకరించింది.

సింగరేణి కంపెనీ కొత్త బొగ్గు గనుల తవ్వకాలకై ,భూగర్భ పరిశోధనాలకు, రైలు మార్గమును, అటవీ భూముల పరిహారంకు రూ.1276 కోట్లు వెచ్చించి పర్యావరణ అనుమతులకై వేచి చూస్తున్న కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణ్ పల్లి, కళ్యాణ్ ఖని, తాడిచర్ల బ్లాక్ -2, వెంకటాపూర్, గుండాల, రాంపూర్, పెద్దాపూర్, పునుకుల చిలక, లింగాల, పెనుగడుప, చండ్రుగొండ, కాకతీయ లాంగ్ వాల్ గనులను వేలం పాటలో కేటాయించడానికి పూనుకుంటున్నారు.సింగరేణి బొగ్గుగనులను వేలం పాటలో కేటాయించే చర్యను నిరసిస్తూ 2021 డిసెంబర్ 9,10,11 తేదిలలో 72 గంటల సమ్మె జరిగింది.

లోక సభలో డిసెంబర్ 17 న కాంగ్రెస్ ఎం.పి ఉత్తమ్ కుమార్ రెడ్డి జీరో అవర్ లో ప్రజా ప్రయోజనాల అంశం కింద సత్తుపల్లి, కోయగూడెం, శ్రావణ్ పల్లి, కళ్యాణ్ ఖని బొగ్గు బ్లాక్ లను వేలం పాట నుండి మినహాయించి సింగరేణి సంస్ధకు కేటాయించాలని సమ్మె జరిగిన విషయాన్ని లేవనెత్తగా బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించి ప్రేరేపిత సమ్మెగా సమాధానం ఇచ్చాడు.సింగరేణి సంస్ధ కూడా వేలం పాటలో పాల్గొని బొగ్గు బ్లాక్ లను దక్కించుకోవాలని సూచించాడు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నట్టుగానే సింగరేణి కంపెనీ ప్రైవేటీకరణ పూర్తిగా అబద్ధం కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

నాటి హైదరాబాద్ స్టేట్ లో 1889 లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించి 1920 డిసెంబర్ 23 నుండి సింగరేణి కాలరీస్ కంపెనీగా, ప్రభుత్వ సంస్దగా బాసిల్లుతుంది.బొగ్గు బాయి పనంటేనే భయపడి దెంకపోయిన కాలం నుండి ప్రమాదాలతో సహవాసం చేస్తూ మూడు తరాల కుటుంబాలు బొగ్గు ఉత్పత్తిలో పాల్గొన్నారు.అవిభక్త ఆంద్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలకు కొంగు బంగారమై సామాజిక అభివృద్ధికి తోడ్పడింది.

Advertisement

భవిష్యత్తు తరాలకు కూడా ఉద్యోగ అవకాశాలకు ,పర్యావరణ, జీవావరణ పరిరక్షణకు తోడ్పడుతు ప్రభుత్వ పరిశ్రమగా పరిఢవిల్లడానికి సేవ్ సింగరేణి పేరిట అనేక పోరాటాలు జరిగినవి.అయిన ప్రభుత్వం ప్రైవేటీకరణకు కావలసిన చట్టాలను రూపొందించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభలో సింగరేణి ప్రైవేటీకరణ పూర్తిగా అబద్ధం అని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన భరోసాను నిజం చేయడానికి బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు అనుకూలంగా తెచ్చిన కొత్త చట్టాలను రద్దు చేసి బొగ్గు గనుల జాతీయకరణ చట్టం 1973 ను యధాతథంగా కొనసాగించి, బొగ్గు పరిశ్రమకు బడ్జెట్ సపోర్ట్ ను కల్పిస్తూ సంపద వికేంద్రీకరణకు మూలమైన ప్రభుత్వ పరిశ్రమల విస్తరణకు,ప్రగతికి తోడ్పడాలని కోరుకుంటున్నారు.

తాజా వార్తలు