తన కన్నీళ్లను పంట కాలువలకు మళ్లించి అయినా పంటలు పండించేది,తన చెమటని చమురుగా మార్చి అయినా దేశ దీపాన్ని వెలిగించేది అన్నదాతే.
చీడ పీడలు గాయపరిచినా,తుపానులు వణికించినా ,అకాల వర్షాలు కన్నీటి మడుగులై కలవర పరిచినా,దళారులు,మిడతల దండై దాడి చేసినా దేశానికి ముద్ద పెట్టేది అన్నదాతే.
అటువంటి అన్నదాతకు ఈ దుర్భర దుస్థితి.అసంబద్ధ,అశాస్త్రీయ పద్దతిలో కనీస మద్దతు ధరల నిర్ధారణ బాగోతాలు నిర్ఘాంత పరుస్తున్నాయి.2022-23 సంవత్సరానికి 14 ఖరీఫ్ పంటల మద్దతు ధరల్ని ఖరారు చేస్తూ ప్రధాన ఆహార పంట వరికి విదిలించింది వందరూపాయలే.ఒక్క ఏడాదిలోనే విత్తనాలు,ఎరువులు,డీజిలు,రవాణా ఖర్చులు 20 శాతం నుండి 30 శాతం వరకు పెరిగిన యదార్ధాన్ని ధరల నిర్దాయక సంఘం గాలికి వదిలేసింది.
ఈ అరకొర మద్దతు ధర పెంపుతో రైతులు ఎలా సాగు చెయ్యాలి?అన్ని ఖర్చులను పరిగణంలోకి తీసుకొంటే క్వింటాలుకు వరికి కనీస మద్దతు ధర రూ 3,000 పైగా ప్రకటించాల్సి వుంది.పెట్టుబడి ఎకరానికి రూ 40 వేల నుండీ రూ 50 వేల వరకు అవుతుంది.
ధాన్యానికి గిట్టుబాటు ధర కాదు కదా కనీసం మద్దతు ధర కూడా దక్కడం లేదు.అమ్మిన ధాన్యానికి 21 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చెయ్యాలి.
కానీ మూడు నెలల నుండి ఆరునెలలకు కూడా ధాన్యం డబ్బులు ఇవ్వడం లేదు రైతులకు.కేరళ,మహారాష్ట్ర,కర్ణాటక ప్రభుత్వాలు రూ 200 నుండి 500 వరకు అదనంగా ధర ఇచ్చి రైతులను ఆదు కొంటున్నారు.
ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ధాన్యం కొనుగోలు చెయ్యకూడదు?నిజంగా రైతుల పట్ల ప్రేమ ఉంటే అదనంగా మద్దతు ధరను ప్రకటించి రైతాంగాన్ని ఆదుకొనే ప్రయత్నం ఎందుకు చెయ్యరు? అట్లాగే వరి ధాన్యం కొనుగోలు పై వైసిపి ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు ఎక్కడా పొంతనలేదు.ప్రతి ఏడాది ధాన్యం కొనుగోలు పై చెప్పిన మాటలే చెబుతున్నారు తప్ప ఆచరణ లో అమలుకాక రైతులు ధాన్యం అమ్ముడు పోక మద్దతు ధర దక్కక మిల్లర్లు,వ్యాపారుల దోపిడీకి గురి అవుతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లర్లు,దళారుల ప్రమేయం లేకుండా మద్దతు ధర అందిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పగా,మరో పక్కప్రభుత్వ కొత్త నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి.మట్టి,తాలు, తేమ ఎక్కువ ఉందని,రంగు మారిందని ధరలో కోత పెడుతున్నారు.75 కేజీల బస్తా ధాన్యానికి రైతుకి రూ 1200 మాత్రమే ఇస్తున్నారు.
అదే మద్దతు ధర ప్రకారం అయితే 75 కేజీల బస్తాకి రూ 1515 ఇవ్వాల్సి వుంది.అంతే కాదు రైతు భరోసా కేంద్రాల నుండి మిల్లర్ల వద్దకు వెళ్లిన ధాన్యం వల్ల రైతులు మరింత నష్ట పోతున్నారు.అనేక వంకలు పెట్టి అయిదు కేజీల వరకు అదనంగా కాజేస్తున్నట్లు సమాచారం.
విత్తనం నుంచి విక్రయం వరకూ ప్రతి దశ లోనూ అన్నింటా తానై చెయ్యి పట్టి నడిపిస్తానని అన్నదాతను బులిపించి అధికారం లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులకు చేసిన సాయం కంటే చేసిన మోసాలే ఎక్కువ.గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలే సర్వరోగ నివారిణి అని చెప్పుకొన్నా ఆర్ బి కె లలో ధాన్యం కొనుగోళ్లు నామ మాత్రమే,పండిన ధాన్యం మద్దతు ధరకు అమ్ముకోలేని దైన్యం , ధాన్య సేకరణలో అంతా గందరగోళం నెలకొన్నది.
రైతు భరోసా కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకోవాలంటే ముందుగా పంట నమోదు చేసుకోవాలి.అందు కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు.ఇ-క్రాప్ బుకింగ్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.
ఇ-క్రాఫ్ బుకింగ్ కి ప్రయత్నిస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది.ముందు గా పంట నమోదు కాక పొతే ఆర్ బి కె లలో పంట కొనుగోలు చెయ్యరు.
పంట నమోదు చేసుకొన్నా నెలల తరబడి పంట అమ్ముకోవడానికి రైతులు ఎదురు చూడాల్సిన దుస్థితి.రాజకీయ పలుకుబడి వున్న పెద్ద రైతులు ముందుగా రైతు భరోసా కేంద్రాల్లో,మార్కెట్ యార్డుల్లో పంట ను అమ్ముకుంటుండగా,పలుకుబడి లేని చిన్న,సన్న కారు రైతులు నెలలు తరబడి ధాన్యం అమ్ముకోవడానికి ఎదురు చూడాల్సిన పరిస్థితి.
వాలంటీర్లే రైతుల వద్దకు వచ్చి పరిశీలించి ఆర్‌బికెల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది.కానీ వాలంటీర్లతో ధాన్యం సేకరణ ఎలా సాధ్యం?వందల మంది రైతులు వుంటారు.ప్రతి రైతు పొలం దగ్గరకు వాలంటీర్లు వెళ్లడం ఎలా సాధ్యం? ఒక్కో వాలంటీర్ రోజుకు ముగ్గురు,నలుగురు రైతుల ధాన్యం మాత్రమే సేకరించగలరు.రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ 15 రోజుల క్రితమే ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించినా ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి.
ఒక పక్కన తుఫానుల హెచ్చరికలు రైతులను కలవర పరుస్తున్నాయి.నూర్చిన ధాన్యాన్ని రోడ్ల పై ఆరబెట్టలేక,పరదాలకు అద్దెలు చెల్లించలేక వచ్చిన ధరకు అమ్మాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు .పెరిగిపోతున్న రైతుల అప్పులు,దక్కని గిట్టుబాటు ధరలతో బావురు మంటున్నది రైతాంగం.ఆరుగాలం కష్ట పడి పంట పండించిన రైతులనే పస్తులుంచే విదంగా వ్యవహరిస్తూ మరో పక్క రైతు ప్రయోజనాలే ముఖ్యమని రైతులను బులిపిస్తున్నారు.
రాష్ట్రంలో నేటికీ ప్రధాన పంట వరి. దీనిని పండించే వారిలో అత్యధికులు కౌలు రైతులే.నిజమైన ఈ సాగుదార్ల పేర్లు ఇ- క్రాప్ బుకింగ్‌లో ప్రభుత్వం నమోదు చేయడం లేదు.
భూ యజమానుల పేర్లు అందులో నమోదు చేయడంతో కౌలుదారులు పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్ముకోలేక కమిషన్ ఏజెంట్లు, మిల్లర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తోంది.చిన్న, సన్నకారు రైతులకూ ప్రభుత్వ భరోసా అందడం లేదు.
కోస్తా జిల్లాల్లో కోతలు ప్రారంభమయ్యి నెల కావస్తుంది.ఆర్‌బికెలలో సరిపడా గొనె సంచులు కూడా లేని దుస్థితి.
ధాన్యాన్ని బయట మిల్లులకు అమ్ముకుందామంటే వారు నేరుగా రైతులనుండి కొనుగోళ్లు నిర్వహించకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.రైతులు గతంలో ప్రభుత్వానికి అమ్మిన ధాన్యానికి సంభందించి బకాయిలు ఇంకా మిగిలి ఉండటంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్బీకే కేంద్రాలకు ధాన్యాన్ని అమ్మేందుకు సిద్దపడటం లేదు.
పాత పద్దతిలోనే ధాన్యం కొనుగోలు చెయ్యాలని రైతులు కోరుతున్నారు.వ్యవసాయ రంగానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాం అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నా ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది రైతుల దుస్థితి.అంకెల గారడీలతో, అబద్దాలతో రైతులను దారుణంగా దగా చేస్తున్నారు.
రైతులు పెట్టుబడి భారం మోయలేక సతమతమవుతున్నారు.దున్నేవాడు లెక్క చూస్తే నాగలి కూడా మిగలదన్న సామెతను గత బడ్జెట్ సమావేశాల్లో జగన్ ప్రభుత్వమే గుర్తు చేసింది.
మరి ఆ సామెతను పరిగణం లోకి తీసికొని జగన్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమిటి?రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నాం అని ప్రభుత్వ పెద్దలు, గొప్పలు చెప్పుకొంటున్నా ఆ సాయం ఏ మూలకూ చాలని పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.ఒక పక్కన సాగు సంక్షోభం పెరిగిపోతుంటే,రైతులు అప్పుల భారంతో కుప్పకూలుతుంటే, మరో పక్క ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగ చేసాం,మాది రైతు పక్ష పాత ప్రభుత్వం అని బాకాలుదు కొంటున్నది జగన్ ప్రభుత్వం.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దేశం లోనే రైతు,వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో రాష్ట్రంలో నిలవగా,నేషనల్ శాంపిల్ సర్వ్ రైతు రుణ గస్ర్తులున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కితాబు ఇచ్చింది.రాష్ట్రంలో వరుస రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాపెట్టుబడి సాయం చేస్తున్నాం అని, ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాం అని ప్రగల్భాలు పలకడం తప్ప నిండు ప్రాణాలు తీసుకుంటున్న రైతుల దుస్థితిని, రోడ్డున పడుతున్న రైతు కుటుంబాల జీవన స్థితిగతుల గురించి ప్రభుత్వం మచ్చుకైనా స్పందించడం లేదు.
అయినా మా పాలనలో సాగు బ్రాహ్మండం అని చెప్పుకోవడం ఆత్మవంచనే అవుతుంది.ఏది ఏమైనా జగన్ ప్రభుత్వ అసమర్ధ, అసంబద్ద విధానాలు రైతుల పాలిట శాపంగా మారాయి.
వ్యవసాయ రంగం పీకల్లోతు సంక్షోభంలో కూరుకు పోయింది.రైతులు ఆరుగాలం కష్ట పడి పండించిన ధాన్యాన్నిఎవరు కొనే పరిస్థితులు లేకపోవడం విచారకరం.
రైతు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలన్నా అయోమయ పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావడం దురదృష్ట కరం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy