కజకస్థాన్‌ ఎయిర్‌‌పోర్ట్‌లో 300 మంది భారతీయులు: రక్షించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం

కరోనా వైరస్ కారణంగా దేశాలకు దేశాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో పాటు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేశాయి.

దీంతో వివిధ దేశాల్లో విద్య, ఉపాధి కోసం వెళ్లిన వారితో పాటు విహారయాత్రకు వెళ్లిన భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వీలైనంత వరకు భారత ప్రభుత్వం పలువురు భారతీయులను విడతల వారీగా స్వదేశానికి తీసుకొచ్చింది.అయితే ఆంక్షలు కఠినం కావడంతో ఇంకా లక్షలాది మంది భారతీయులు పలు దేశాల్లో చిక్కుకుపోయారు.

వీసా గడువు ముగుస్తుండటం, నిలువ నీడ లేకపోవడంతో ఆయా దేశాల్లో భారతీయుల అవస్థలు వర్ణనాతీతం.ఈ నేపథ్యంలో సుమారు 300 మంది భారతీయ విద్యార్ధులు కజకస్తాన్‌లోని అల్మాటి విమానాశ్రయంలో గత రెండు రోజుల నుంచి ఎలాంటి ఆహారం, వైద్య సదుపాయం లేకుండా అల్లాడుతున్నారు.

అక్కడ చిక్కుకుపోయిన ఓ విద్యార్ధి తల్లి సెహ్లా సైరా తమ బిడ్డతో పాటు మిగిలిన భారతీయులను కాపాడాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్, తల్వాంత్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం కజకస్తాన్‌లో చిక్కుకుపోయిన విద్యార్ధులకు ఆహారం, వైద్య సదుపాయం, బస రవాణాకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర విదేశాంగ శాఖను ఆదేశించింది.

Delhi High Court Mea To 300 Indian Students Kazakhstan
Advertisement
Delhi High Court MEA To 300 Indian Students Kazakhstan-కజకస్థాన�

పిటిషనర్ తరపున న్యాయవాది ఫోజియా రెహ్మాన్ వాదనలు వినిపించగా, విదేశాంగ శాఖ తరుపున కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ న్యాయవాది జాస్మీత్ సింగ్ వాదనలు వినిపించారు.లాయర్లు ఇద్దరు తమ తమ కార్యాలయాల నుంచి వాదించగా, ఇద్దరు న్యాయమూర్తులు తమ ఇంటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు.కజకస్తాన్‌లోని సెమే మెడికల్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ సహా ఉన్నత చదువులు అభ్యసించడానికి వెళ్లిన 300 మంది భారతీయ విద్యార్ధులు గత మూడు రోజుల నుంచి ఆహారం, నీరు, రవాణా, వైద్య సదుపాయం లేకుండా ఎయిర్‌పోర్ట్‌లోనే అల్లాడుతున్నారని రెహమాన్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు మార్చి 28 కల్లా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా విదేశాంగ శాఖ ద్వారా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.విద్యార్థుల సంక్షేమం ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించడానికి కేంద్ర విదేశాంగ శాఖ, కజకస్తాన్‌లో భారత రాయబార కార్యాలయం వెంటనే ఒక నోడల్ అధికారిని నియమించాలని న్యాయస్థానం ఆదేశించింది.

నోడల్ అధికారి వివరాలు, అతని పేరు, చిరునామా, ఫోన్ నెంబర్‌ను విద్యార్ధులకు అందజేయాలని అలాగే కజకస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయం, భారత విదేశీ వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లో తెలిపింది.తదుపరి విచారణను మార్చి 28కి వాయిదా వేసింది.

తాజా వార్తలు