కవితకు వచ్చిన కష్టమేంటి ? ఎందుకు ఆ మౌనం ?

తండ్రికి తగ్గ కూతురిగా తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆశతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎంపీగా గెలిచి తన సత్తా చాటుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందింది.

ఇక అప్పటి నుంచి ఆమె పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

అంతే కాదు తాను ఎక్కువగా దృష్టిపెట్టిన నిజామాబాద్ జిల్లా వైపు రావడంలేదు.ఆమెకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఆహ్వానాలు అందుతున్న ఆమె మాత్రం హాజరుకావడంలేదు.

అయితే దీనికి కారణం ఆమె ఇప్పటికీ ఓటమి ప్రభావం నుంచి కోలుకోలేకపోవడమేనని తెలుస్తోంది.ఎన్నికల్లో ఓటమి తరువాత ఆమె ఒక్కసారి మాత్రమే ఈ జిల్లాకు వచ్చి వెళ్లారు.

అంతే కాదు రాష్ట్రంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకాకుండా ఆమె సైలెంట్ అయిపోవడం వెనుక కారణాలు తెలియక పార్టీ నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు.

Advertisement

పార్లమెంట్ ఎన్నికల్లో కవిత పరాజయం తర్వాత నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీని నడిపించేవారే కరువయ్యారు.గ‌తంలో జిల్లాలో అన్నీ తానై పార్టీ శ్రేణులను ఆమె నడిపించేవారు.పార్టీ కార్యక్రమాలన్నీ ఆమె ఆధ్వర్యంలోనే జరుగుతుండేవి.

ఆమె ఎంపీగా ఉన్నప్పుడు జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో అభివృద్ధి పనులను పర్యవేక్షించేవారు.కానీ ఇప్పుడు పార్టీ గురించి అస్సలు పట్టించుకోకపోవడంతో పార్టీ క్యాడర్లో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న పార్లమెంట్ ప‌రిధితోపాటు నిజామాబాద్ జిల్లాలోని మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుకోసం కవిత శ్రమించారు.ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోనూ రోడ్‌ షోలతో ప్రచారానికి ఒక ఊపు తెచ్చారు.

ఆ ప్రభావంతో ఫలితాలు కూడా బాగా వచ్చాయి.అయితే పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచిన ఎమ్యెల్యేలు కవిత గెలుపుకోసం అంతగా శ్రమించలేదన్న విమర్శ కూడా వినిపిస్తోంది.

ప్రస్తుతం తెలంగాణాలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు దగ్గరపడుతున్నాయి.ఇటువంటి సమయంలో కవిత సైలెంట్ గా ఉండడం నాయకులను కలవర పరుస్తోంది.టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన పార్టీ స‌భ్యత్వం కార్యక్రమానికి కూడా క‌విత దూరంగా ఉంటున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో జిల్లా టీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఆధిపత్యపోరు మొదలైంది.ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు.

దీంతో క్యాడ‌ర్‌లో అయోమ‌యం అలుముకుంది.ఇదే సమయంలో జిల్లాలో బీజేపీ నేత‌లు కూడా దూకుడు పెంచారు.

టీఆర్ఎస్ ప్రధాన టార్గెట్‌గా వారు దూసుకెళుతున్నారు.కీలకమైన నాయకులందరికీ గేలం వేస్తూ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయినా ఇటువంటి సమయంలో కవిత సైలెంట్ గా ఉండడం టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడం ఖాయంగానే కనిపిస్తోంది.

తాజా వార్తలు