కాపు నాడు తో ' గంటా ' క్లారిటీ ఇస్తారా ? 

విశాఖ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న టిడిపి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఆయన టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా,  ఆయన ఆ పార్టీలో యాక్టివ్ గా ఉండడం లేదు.

వైసీపీలోకి వెళ్లేందుకు అనేకసార్లు ఆయన ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదు.కచ్చితంగా 2024 ఎన్నికల్లో గంటా వైసీపీ లేదా జనసేనలో చేరుతారనే ప్రచారం చాలాకాలంగా నడుస్తోంది.

తనపై ఎన్ని రకాల ఊహగానాలు వస్తున్న,  గంటా మాత్రం బయటకు వెల్లడించడం లేదు.తాజాగా ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు.

విశాఖలో కాపునాడు సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు . వంగవీటి మోహన రంగా వర్ధంతి డిసెంబర్ 26 జరగబోతున్న నేపథ్యంలో,  విశాఖలో కాపునాడు ను ఘనంగా నిర్వహిస్తామని గంటా ప్రకటించారు.రంగా అందరివాడు అని,  ఆయన బడుగు బలహీన వర్గాలకు ప్రతినిధి అని  ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఏపీలో కేవలం రెండు పార్టీలే ఉన్నాయా అంటూ వైసీపీ టీడీపీలను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు.

దీంతో ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతున్నారా అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి.అయితే ప్రస్తుతం నిర్వహించబోతున్న కాపునాడు సభ పార్టీలకు అతీతంగా ఉంటుందని చెబుతున్నారు.

అయితే ఈ కాపు నాడు పోస్టర్ లో ఒకవైపు గంటా శ్రీనివాసరావు ఉండగా,  మరోవైపు చిరంజీవి ఉండడంతో ఈ సభ పై మరింత ఆసక్తి,  అనుమానాలు కలుగుతున్నాయి.ఈ కాపునాడు సభకు మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. 

చిరంజీవి అనుమతితోనే కాపునాడు పోస్టర్ పై ఆయన బొమ్మ వేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.అయితే ఈ సభలో గంటా ఏం మాట్లాడబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.కాపులకు ముఖ్యమంత్రి పదవి దక్కాలి అనే డిమాండ్ ను కనుక ఆయన ఈ సందర్భంగా లేవనెత్తితే గంటా కచ్చితంగా జనసేన వైపు వెళ్తారనే విషయంలో క్లారిటీ రాబోతోంది.

కాపులకు రాజ్యాధికారం అంటూ ఈ సభలో ప్రసంగాలు ఉంటే అది టిడిపి , వైసిపిలకు ఇబ్బందికరంగా మారుతుంది.అదే సమయంలో జనసేనకు  మరింత ఊపు వస్తుంది.రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలకు కాపు సామాజిక వర్గం ఓట్లు కీలకం కావడంతో,  గంటా సరైన సమయం చూసి ఈ కాపునాడు సభను ఏర్పాటు చేశారని , తన ప్రాధాన్యం మరింతగా పెంచుకునేందుకు ఆయన ప్రయత్నించబోతున్నారనే విషయం అర్థమవుతుంది.

Advertisement

   .