జగన్‌ను చెడుగుడు ఆడుకున్న సీనియర్‌ జర్నలిస్ట్‌

ఏపీకి మూడు రాజధానులు ఉంటే తప్పేంటి అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం జగన్మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు సీనియర్‌ జర్నలిస్ట్‌, ద ప్రింట్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ శేఖర్‌ గుప్తా.

ఆయన తీసుకున్న నిర్ణయం పిచ్చి తుగ్లక్‌ చర్య అని తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు.

తుగ్లక్‌ డబుల్‌ కెఫీన్‌తో 20 కాఫీలు ఒకేసారి తాగి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉందని శేఖర్‌గుప్తా వ్యాఖ్యానించడం గమనార్హం.

రాజధానిని అమరావతి నుంచి మార్చాలన్న ఏపీ సీఎం ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన 20 నిమిషాల ఓ వీడియోను విడుదల చేశారు.దేశంలో చండీగఢ్‌ తర్వాత మరో గ్రీన్‌ఫీల్డ్‌ నగరం లేదని, అమరావతి ఏపీకే కాదు.దేశానికి కూడా చాలా అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా దేశంలో పశ్చిమ తీరంలో ఉన్న రాష్ట్రాలు, నగరాలు అభివృద్ధిలో పోటీ పడుతుంటే.తూర్పు తీరంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి నిర్మాణం చాలా ముఖ్యమని శేఖర్‌గుప్తా స్పష్టం చేశారు.

Advertisement

జగన్‌ స్థానంలో ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉంటే ఇలా చేసే వారు కాదని, అమరావతిని చంద్రబాబు కంటే కూడా గొప్పగా నిర్మించి ఉండేవాళ్లని ఆయన చెప్పడం విశేషం.సమున్నత లక్ష్యంతో మొదలైన అమరావతిలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను జగన్‌ మధ్యలోనే ఆపేశారని శేఖర్‌గుప్తా మండిపడ్డారు.ఈ అనర్థాన్ని ఒక్క ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే ఆపగలరని, ఆయనే జగన్‌కు చెప్పాలని గుప్తా అన్నారు.

దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం జాతీయ విషాదమని ఆయన అభిప్రాయపడ్డారు.జమ్ముకశ్మీర్‌లో వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు రాజధానులు ఏర్పాటు చేశారని, ఏపీలో ఆ అవసరం కూడా లేదని శేఖర్‌ గుప్తా స్పష్టం చేశారు.

సంపద సృష్టించాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా.అమరావతిలాంటి పెద్ద నగరాలు రావాల్సిందే అని ఆయన అన్నారు.

తాజా వార్తలు