గౌతమీపుత్ర శాతకర్ణి రివ్యూ

చిత్రం : గౌతమీపుత్ర శాతకర్ణి బ్యానర్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ దర్శకత్వం : జాగర్లమూడి క్రిష్ నిర్మాతలు : సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి సంగీతం : చిరంతన్ భట్ విడుదల తేది : జనవరి 12, 2017 నటీనటులు : బాలకృష్ణ, శ్రియ, హేమా మాలినీ, ఫరా కరీమి తదితరులు శతకం అంటే ఓ మైలురాయి, ఓ జ్ఞాపకంగా మిగిలిపోయేది.

అందుకే బాక్సాఫీస్ హోరులో పడిపోయి, రెగ్యులర్ మాస్ సినిమా చేయకుండా, ప్రేక్షకుల హృదయాల్లో తన శతకం చెరగని ముద్రవేయాలని, బాలయ్య బాబు తెలుగు ఖ్యాతిని ఉన్నతశిఖరాలకు చేర్చిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవితగాథను కథావస్తువుగా ఎంచుకున్నారు.

బాలకృష్ణ - క్రిష్ చేసిన ఈ సాహసం అద్యంతం ఎలా సాగిందో రివ్యూలో చూడండి.

కథలోకి వెళ్తే :

ఐదేళ్ళ వయసులోనే భారత రాజ్యాలన్ని ఒక్కటి చేసి అఖండ భారతావనిని యుద్దాలు లేని ఒక్క దేశంగా చూడాలని నిశ్చయించుకుంటాడు శాతకర్ణి (బాలకృష్ణ).తన కలని, తన తల్లి గౌతమీకి (హేమా మాలిని) మాటగా చెబుతాడు.

సింహాసనాన్ని అధిష్టించిందే ఆలస్యం, వరుస యుద్ధాలతో శాతవాహన సామ్రజ్యాన్ని విస్తరిస్తూ, రాజులందరిని తన సామంతులుగా చేసుకుంటూపోతాడు.ఈ క్రమంలో తన భార్య వాశిష్టిదేవకిి (శ్రియ) మానసికంగా దూరమవుతున్న, తను కలగన్న భారతదేశం కోసం, నిర్విరామంగా శ్రమిస్తాడు.

మరోవైపు శాతకర్ణి, అతని సామంతులందరిని ఓడించి, భారతదేశాన్ని తన వశం చేసుకోవాలని తన ప్రయత్నాలు చేస్తుంటాడు గ్రీకు రాజు డిమిట్రియస్.శాతకర్ణిని అంతం చేసేందుకు అతని వద్ద ఉన్న ప్రధాన అస్త్రం యతీనా (ఫరా కరీమి).

Advertisement

మరి భారతఖండం మహారాజు, సామంతులకి, గ్రీకు రాజు మధ్య జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారు? శాతకర్ణి కన్న కల ఫలించిందా లేదా అనే విషయం తెర మీదే చూడాలి.

నటీనటుల నటన :

శాతకర్ణిగా బాలకృష్ణ తన కెరీర్ బెస్ట్ రోల్ లో కనిపించారు.ఆయన లుక్స్ ని పక్కనపెట్టి, నటన గురించే మాట్లాడుకుంటే, ఒక్కో సమయంలో రోమాలు నిక్కబొడుచుకుంటాయి, శాతకర్ణి పౌరుషం మన ముఖంపై కూడా ప్రతిబింబిస్తుంది.

అంతలా అబ్బురపరిచారు బాలకృష్ణ.అగ్రెసివ్ పాత్రలకు ఎలాగో బాలకృష్ణ్ పెట్టింది పేరు, ఈ సినిమాలో ఆ అగ్రెషన్ కి రాయల్టి జతకలిసింది.కొడుకుని యుద్ధభూమికి తీసుకెళ్ళడమే కాదు, తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది అని శ్రియకి ధిక్కారంగా వివరించే సన్నివేశంలో బాలకృష్ణ అభినయం చప్పట్లు కొట్టేలా చేస్తుంది.

నటనపరంగా ఒక్క మాట అనడానికి లేదు కాని, కత్తి యుద్ధాలపై ఇంకాస్త పట్టు సాధిస్తే బాగుండేది.మహారాణిగా శ్రియ చక్కగా సరిపోయింది.

మహారాణిలో ఉండే ఆ హుందాతనం, అందం, భర్తను ఎదురించేటప్పుడు రగలాల్సిన భావోద్వేగం, తనకు మాత్రమే సాధ్యపడే గ్రేస్ ఫుల్ నృత్యాలతో శ్రియ మంచి మార్కులు కొట్టేసింది.ఇక రాజమాతగా హేమామాలిని ఎంచుకోని క్రిష్ ఎప్పుడో సక్సెస్ అయ్యారు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
శ్రీవారి సన్నిధిలో మరో విషాదం.. లడ్డూ కౌంటర్లో అగ్నిప్రమాదం

ఉన్న అంచనాలని ఆవిడ అందుకుంది కూడా.ఫరా కరిమి తనకిచ్చిన పాత్రకు సరిపోయింది.

Advertisement

శివన్న మెరిసారు, మెప్పించారు.మిగితా పాత్రధారులు సరిగా ఎలివేట్ కాకపోవడం చిన్నగా నిరుత్సాహపరచవచ్చు.

టెక్నికల్ టీమ్ :

జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫి ఒక ఎత్తైతే, మహేష్ భూపతి ఆర్ట్ మరోక ఎత్తు.ఇంత తక్కువ బడ్జెట్ తో అలాంటి ఆర్ట్ అసలు ఎలా అందించారో నిజంగా అర్థం కావడం లేదు.

ఇప్పటికీ, 60 కోట్ల లోపే ఈ సినిమాని, ఇలాంటి ఆర్ట్ విజువల్స్ తో పూర్తి చేశారంటే నమ్మడం కష్టం.సినిమాటోగ్రాఫి సూపర్.అయితే కొన్ని చోట్ల బడ్జెట్ లేమి కనబడుతుంది.

చిరంతన్ నేపథ్య సంగీతం అమోఘం.సీన్స్ ని బాగా ఎలివేట్ చేసాడు పాటలు చాలా బాగా వచ్చాయి.

ఉన్న పరిమితుల్లో నిర్మాణ విలువలు అబ్బురుస్తాయి (కొన్ని సీన్స్ తప్ప).యుద్ధ సన్నివేశాల్ని ఇంకా బాగా ఎడిట్ చేయాల్సింది.

ఇక్కడే, రాజమౌళి విలువ తెలిసొచ్చేది.

విశ్లేషణ :

60 కోట్ల తక్కువ బడ్జెట్ తో క్రిష్ ఈ కథను తీయొచ్చు అని ఏ సమయంలో ఊహించుకున్నాడో కాని, ఇకపై తక్కువ బడ్జెట్ లో పెద్ద సినిమాలు తీయాలనుకునే ప్రతీ ఒక్కరు ఈ సినిమానే చూస్తారు.సలహాలు అయన్నే అడుగుతారు.

ఎక్కడా అనవసరపు సీన్లకి వెళ్ళకుండా కథను సూటిగా చెప్పిన క్రిష్, యుద్ధ సన్నివేశాల్ని మాత్రం ఊహించిన రీతిలో డిజైన్ చేసుకోలేకపోయాడు.వార్ ఎపిసోడ్స్ బాగా లేక కాదు, ఎక్కడ బాహుబలితో పోల్చి చూస్తారో అని భయం.అంతే, ఇక అన్ని విజయాలే.తన టేకింగ్, క్రాఫ్ట్స్ ని నడిపించిన తీరు, నటుల నుంచి ప్రతీ డీటేల్డ్ హావాభావాన్ని రాబట్టిన తీరు, కొత్త దర్శకులందరికి పాఠాలు.

నరేషన్ లో ఎక్కడా తప్పులు లేవు.మనకు తెలియని చరిత్ర, ఓ గొప్ప రాజు యొక్క జీవితం .తెరపై గౌతమీపుత్ర శాతకర్ణి ఓ అద్భుతం.

ప్లస్ పాయింట్స్ :

* బాలకృష్ణ , ప్రధాన తారాగణం * క్రిష్ దర్శకత్వ ప్రతిభ * ఆర్ట్, సినిమాటోగ్రాఫి, సంగీతం * నిర్మాణ విలువలు * సాయిమాధవ్ మాటలు

మైనస్ పాయింట్స్ :

* యుద్ధ సన్నివేశాలు ఇంకా బాగా ఎడిట్ చేయాల్సిసింది.

చివరగా :

సాహో గౌతమీపుత్ర శాతకర్ణి, సాహో బసవతారకపుత్ర బాలకృష్ణ, సాహో అంజనపుత్ర క్రిష్

తెలుగుస్టాప్ రేటింగ్ : 3.5/5

.

తాజా వార్తలు