రాజీనామా చేయమన్న అమిత్ షా ? డైలమాలో రాజగోపాల్ రెడ్డి ? 

 తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నారనే ప్రచారం ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది.

దీనికి కారణం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో తాజాగా భేటీ కావడమే.

చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఇమడ లేక రాజగోపాల్ రెడ్డి ఇబ్బందులు పడుతున్నారు.పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

టిఆర్ఎస్ ను ఓడించే పార్టీలో చేరుతానంటూ చాలా కాలం నుంచి ఆయన ప్రకటనలు చేస్తున్నారు.దీంతో ఆయన బీజేపీ లో చేరబోతున్నారనే క్లారిటీ అందరికీ వచ్చింది.

దీనికి తగ్గట్లుగానే ఓ ఎంపీ సాయంతో అమిత్ షా తో రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం, బిజెపిలో చేరే విషయమై చర్చించగా , కాంగ్రెస్ పార్టీకి,  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పుడు బిజెపిలో చేరాల్సిందిగా అమిత్ షా కండిషన్ విధించడంతో రాజగోపాల్ రెడ్డి అయోమయంలో పడ్డారట.      ఇదే విషయమే తాజాగా రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రస్తావించారు.

Advertisement

తాను అమిత్ షాను కలిసిన మాట వాస్తవమేనని, బిజెపి ఎంపీ శశికాంత్ దూబే ద్వారా తాను అమిత్ షాను కలిసినట్లు రాజగోపాల్ రెడ్డి ఒప్పుకున్నారు.అయితే సరైన సమయంలో తన నిర్ణయం ఏమిటి అనేది ప్రకటిస్తానని , ఇప్పట్లో పార్టీ మారే ఆలోచన లేదంటూ రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.

అయితే  పార్టీ మారే ఆలోచన చేయడం లేదు అంటూ రాజగోపాల్ రెడ్డి ప్రకటించడం వెనక చాలా కథే ఉందట.గతంలో బిజెపిలో చేరేందుకు రాజగోపాల్ రెడ్డి ప్రయత్నించిన సమయంలోనే కొంతమంది ముఖ్య నాయకులు , అనుచరుల వద్ద రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ .తానే బిజెపిలో కీలకం కాబోతున్నానని , బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా తానే అంటూ రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించిన అంశాలు కేంద్ర బిజెపి పెద్దల వరకు చేరడంతో వారు రాజగోపాల్ రెడ్డి చేరిక విషయంలో సానుకూలంగా లేకపోవడానికి కారణమట.   

  ఈ విషయం గ్రహించే అమిత్ షా పార్టీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పుడు బిజెపిలో చేరాల్సిందిగా కండిషన్ విధించడంతో , ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు సమాచారం.ఆయన బిజెపిలో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుండడం, కాంగ్రెస్  పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం సొంత పార్టీపై విమర్శలు చేస్తుండడం తదితర కారణాలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు ఆ పార్టీ అధిష్టానం పెద్దల సైతం ఆగ్రహంతో ఉన్నారు.ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగినా,  రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందన్న గ్యారెంటీ కూడా కనిపించడం లేదు.

అలా అని అమిత్ షా విధించిన కండిషన్ లకు ఒప్పుకొని బిజెపిలో చేరినా,  ఆశించిన స్థాయిలో తనకు ప్రాధాన్యం దక్కుతుంది అన్న నమ్మకం లేకపోవడంతో రాజగోపాల్ రెడ్డి పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవడిలా మారినట్టుగా తయారయ్యింది. .

Advertisement

తాజా వార్తలు