అగ్రిగోల్డ్ టూ హాయ్ ల్యాండ్ : ఇదేం గొడవరా బాబు

రాజకీయం అంటే ఎప్పుడూ ఏదో ఒక అంశం మీద పోరాటం చేస్తూ జనాల్లో తమ ఉనికిని చాటుకుంటూ ఉండాలి.లేకపోతే రాజకీయ నాయకులకు మనుగడే ఉండదు.

అందుకే చిన్నదో పెద్దదో ఒక అంశం మీద పోరాటం ముగిసిన వెంటనే మరో పోరాటం మొదలుపెడుతూ ఎక్కడలేని హడావుడి చేస్తూ ఉంటారు.ఇప్పుడు ఏపీలో ఆ విధమైన రాజకీయమే నడుస్తోంది.

ఇప్పటివరకు ఏపీలో నెలకొన్న ఇసుక కొరతపై అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి.ప్రస్తుతం ఆ వేడి కాస్తా చల్లారుతోంది అనుకుంటున్న సమయంలో ఇప్పుడు అగ్రీ గోల్డ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

అధికార విపక్ష పార్టీల మధ్య ఇప్పుడు అగ్రిగోల్డ్ వ్యవహారం వేడెక్కుతోంది.దీనిపై ఇరు పక్షాల మధ్య విమర్శల జడివాన కురుస్తోంది.

Advertisement

అగ్రిగోల్‌ వ్యవహారంలో రెండు రోజుల క్రితం అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం టీడీపీపై తీవ్ర విమర్శలు చేయడంతో ఇది మరింతగా ముందురింది.అగ్రిగోల్డ్ విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడిందని, హాయ్‌ల్యాండ్ భూములను కాజేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్లాన్ చేశారని తమ్మినేని ఆరోపణలు చేశారు.

అగ్రిగోల్డ్‌తో సంబంధంలేదని చంద్రబాబు ప్రకటించగలరా అంటూ తమ్మినేని సవాల్ కూడా విసిరారు.ఈ విమర్శలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా అతనదైనా శైలిలో స్పందించారు.

అగ్రిగోల్డ్‌ ఆస్తులతో తనకు సంబంధం ఉన్నట్టుగా స్పీకర్‌ చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటూ ప్రతి సవాల్ విసిరారు.ఒకవేళ ఆరోపణలు అవాస్తవం అని తేలితే మీరేం చేస్తారో చెప్పాలంటూ లోకేష్‌ లేఖలో డిమాండ్‌ చేశారు.

దీనిపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందిస్తూ లోకేష్ స్పీకర్ కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉండడమే కాకుండా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందంటూ వెల్లంపల్లి వెటకారపు వ్యాఖ్యలు చేశారు.దీనిపై ఇరు పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రచ్చ రచ్చ చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు