వైవీఎస్ చౌదరి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు.అయితే ఈయన ఆర్థిక పరిస్థితి గత కొంత కాలంగా ఆందోళనకరంగా ఉన్నట్లుగా అర్థం అవుతోంది.
ఈయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘రేయ్’.దాదాపు మూడు సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ సినిమా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది.
‘రేయ్’ సినిమా ఆడియో కూడా విడుదలైంది.కాని సినిమా విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు.
దాదాపు సంవత్సరంనర కాలంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది.ఈ సినిమాను విడుదల చేసేందుకు చౌదరి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.
తాజాగా ఎన్టీఆర్ వర్థంతి సందర్బంగా వైవీఎస్ చౌదరి ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించాడు.ఈ సందర్బంగా చౌదరి మాట్లాడుతూ.
తాను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అన్నగారి ఆశీస్సులు దక్కి విజయం సాధించాను.సంతానం కోసం అన్నగారి ఆశీస్సులు తీసుకోవడంతో మంచి జరిగింది.
తాజాగా ఇప్పుడు ‘రేయ్’ సినిమాకు ఉన్న అడ్డంకులు తొలిగి పోవాలని అన్నగారిని వేడుకున్నాను.ఆయన తన కోరికను మన్నించి త్వరలో ‘రేయ్’ విడుదలకు మార్గం సుగమం చేస్తాడని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
వచ్చే నెలలో ‘రేయ్’ని విడుదల చేయడం గురించి చౌదరి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.