అయ్యో మాకు అవకాశం దక్కలేదే ! వైసీపీ ఎంపీల ఆవేదన     2018-07-20   11:59:51  IST  Sai Mallula

ఒక్కొక్కసారి తొందరపాటులో తీసుకున్న నిర్ణయాలు తీరని నష్టాన్ని మిగులుస్తాయి. అందుకే ఏ పనిచేసినా అలోచించి చేయాలంటారు పెద్దలు. ఇక రాజకీయ పార్టీల తొందరపాటు నిర్ణయాలు ఒక్కొక్కసారి ప్రత్యర్థులకు వరంగా మారుతాయి. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ తీసుకున్న తొందరపాటు నిర్ణయంతో ప్రత్యర్థి టీడీపీ పొలిటికల్ మైలేజ్ కొట్టేయబోతుండగా .. వైసీపీ మాత్రం చేసింది లేక ధీనంగా జరిగేది చూడాల్సి వస్తోంది.
ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీసేందుకు తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం,దాన్ని లోక్‌సభ స్పీకర్‌ చర్చకు అనుమతించడం.. పార్లమెంటులో టీడీపీ ఎంపీల హడావుడి వంటి పరిణామాలతో వైసీపీ డీలా పడింది. ఇలాంటి కీలక సమయంలో లోక్‌సభలో తమ పార్టీ ఎంపీలు లేకపోవడంతో రాజకీయంగా వెనక్కి వెళ్లిపోయామనే ఆలోచనలో ఆ పార్టీ ఉంది.

Ysrcp Mps About Tdp No Confidence Motion Against BJP-

Ysrcp Mps About Tdp No Confidence Motion Against BJP

తొందరపాటు గా వెనుకా ముందు ఆలోచించకుండా రాజీనామా చేసి తప్పు చేశామన్న ఆందోళన వైసీపీ మాజీ ఎంపీల్లోనూ కనిపిస్తోంది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లోనూ టీడీపీ, వైసీసీ పోటాపోటీగా వేర్వేరుగా అవిశ్వాసానికి నోటీసులిచ్చినా.. చర్చకు రాని సంగతి తెలిసిందే. బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్‌ 6న ఐదుగురు వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి రాజీనామా చేశారు. గత నెల 21న వాటిని స్పీకర్‌ ఆమోదించారు. అయితే వర్షాకాల సమావేశాల నాటికి పరిస్థితులు అనూహ్యంగా మారాయి. సమావేశాల మొదటి రోజే టీడీపీ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్‌ అనుమతించడంతో వైసీపీ ఆలోచనలోపడింది.

అనవసరంగా రాజీనామా చేశామా అని భావన వారిలో కనిపిస్తోంది. ఈ రోజు జరగబోయే అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చ కోసం దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. ఇంత కీలక సమయంలో లోక్‌సభలో మా పార్టీ గళాన్ని వినిపించలేకపోతున్నాం. మేమూ సభలో ఉంటే బాగుండేది. నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా రాజీనామాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడేం చేస్తాం’ అని ఓ సీనియర్‌ మాజీ ఎంపీ వాపోయారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు సాధనకు టీడీపీ మాత్రమే పోరాడుతోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని వైసీపీ ఆందోళన చెందుతుంది.