పశ్చిమ పై వైసీపీ కొత్త స్కెచ్ .. తుస్సేనా ...?       2018-05-11   03:36:06  IST  Bhanu C

ఏపీలో తరువాత వచ్చే ప్రభుత్వం తమదే అనే కవరింగ్ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. అందుకు తగ్గట్టు తమ పార్టీ నాయకులను సిద్ధంచేస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే… ఈ నెల 14 వ తేదీ నుంచి జగన్ చేపడుతున్న ప్రజా సంక్షేమ యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ప్రవేశించనుంది. ఈ సందర్భంగా ఈ జిల్లాపై పూర్తి స్థాయి పట్టు ఉన్న టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా వలసలు ఉండేలా ఆ పార్టీ వ్యూహం పన్నుతోంది. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయా ప్రాంతాల నుంచి ఒక మోస్తారు పేరు ఉన్న నాయకులందరినీ చేర్చుకుని బలం పెంచుకోవాలని వైసీపీ ప్లాన్.

అయితే ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే.. ఒకరిద్దరు నాయకులు తప్ప వైసీపీ వారు ఊహించిన స్థాయిలో నేతలు పార్టీలో చేరేందుకు సముఖత చూపడంలేదని సమాచారం. అయినా పట్టు వీడకుండా కొంతమంది టీడీపీ నాయకుల చుట్టూ వైసీపీ లో కొంతమంది ముఖ్య నాయకులు తిరుగుతున్నట్టు సమాచారం. చేరికలు అంటే చోటామోట నాయకులు కాకుండా ఒక స్థాయిలో ఉన్న నాయకులనే ఆహ్వానించాలని హైకమాండ్ నుంచి అందిన ఆదేశాలు అట. చింతలపూడి నియోజకవర్గంలో కొం దరు నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇంత కుముందు భావించినా వారిలో ఒకరిద్దరు మాత్రం ఎన్నికల ఖర్చు భరించడం తమవల్ల కానిపని అని చేతులేత్తేసారట.

అయితే టీడీపీ నాయకులు వైసీపీలో చేరబోతున్న వార్తలు పై ఆ పార్టీ కుడా ఘట్టి నిఘనే ఏర్పాటు చేసింది. అందుకే పార్టీ నుంచి ఒక్కరు కుడా బయటకు వెళ్ళకుండా చర్యలు తీసుకుంటోంది. అందుకే నియోజకవర్గాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒక కన్నేసి ఉంచారు. తమ పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకత్వంలో ఎవరైనా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారా? అనే దానిపై ఆరా తీస్తున్నారు. కానీ ఎక్కడా ఆ పరిస్థితులు కనిపించకపోవడంతో హమ్మయ్య అనుకుంటున్నారు.

వైసీపీ నేతలు చెబుతున్న సమాచారం ప్రకారం… ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు సీనియర్‌ నాయకులు నేరుగా వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిలో కాంగ్రెస్‌ మాజీ నేతలు కుడా ఉన్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్న మాట. అయినా టీడీపీ కంచుకోట లాంటి పశ్చిమగోదావరి జిల్లాలో ఆ పార్టీని దెబ్బకొట్టడం అంత సులువైన విషయం కాదు.