వైసీపీ ఫొటోల‌తో సహా దొరికిపోయిందిగా...       2018-05-08   00:58:44  IST  Bhanu C

ఏపీలో ఉన్న రాజ‌కీయ ప‌రిణామాలు చాలా విభిన్నంగా ఉన్నాయి. ఇక్క‌డ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కోసం పెద్ద ఎత్తున ఉద్య‌మాలు సాగుతున్నా యి. ముఖ్యంగా అధికారంలో ఉన్న టీడీపీ.. కేంద్రంలోని బీజేపీని శ‌త్రువుగా మార్చేసింది. ఏపీకి శ‌త్రువు ఎవ‌రైనా ఉన్నారంటే.. అది బీజేపీనేన‌ని, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీనేన‌ని ప్ర‌చారం చేస్తోంది. ప్ర‌త్యేక హోదా విష‌యంలో త‌లెత్తిన ఈ వివాదం.. అటు తిరిగి.. ఇటు తిరిగి బీజేపీ మెడ‌కు చుట్టారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే కేంద్రంపై విరుచుకుప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీపై క‌త్తిక‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అక్క‌డ బీజేపీకి వ్య‌తిరేకంగా కూడా టీడీపీ ప్ర‌చారం చేయిస్తోంది. దీనికిగాను పెద్ద ఎత్తున త‌న టీంను రంగంలోకి దింపింది. అయితే, అదే స‌మ‌యంలో బీజేపీని త‌న లాగా తిట్ట‌నివారు ఎవ‌రైనా ఏపీకి అన్యాయం చేసిన‌ట్టేన‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నాడు చంద్ర‌బాబు అండ్ త‌మ్మ‌ళ్ల టీం. ఈ క్ర‌మంలోనే వీరు వైసీపీ, ప‌వ‌న్‌ల‌ను దోషులుగా చిత్రీక‌రిస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో బీజేపీని తిట్ట‌కపోతే పాపం అన్న‌ట్టుగా మార్చేశారు చంద్ర‌బాబు. ఇక, సీన్ క‌ట్ చేస్తే.. విప‌క్షం వైసీపీ.. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఏపీలో అధికారంలోకి రావాల‌ని భావిస్తోంది.

అయితే, బీజేపీని మాత్రం ఈ పార్టీ టార్గెట్ చేయ‌క‌పోవ‌డం టీడీపీకి అందివ‌చ్చిన అవ‌కాశంగా మారింది. దీనికితోడు.. ఇప్పుడు తాజాగా క‌ర్ణాట‌క‌లో బీజేపీ అభ్య‌ర్థి ప‌క్షాన వైసీపీ కీల‌క నేత ఒక‌రు ప్ర‌చారం చేస్తున్నారు. ఈ విష‌యం ఇప్పుడు ఏపీలో దావాల‌నంగా వ్యాపించింది. దీనిని నేరం, ఘోరం అన్న‌ట్టుగా ప్ర‌చారం చేస్తున్నారు టీడీపీ నేత‌లు. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌నందుకు మేం మోడీని తిడుతున్నాం.. కేంద్రంపై పోరాడుతున్నాం కాబ‌ట్టి మీరు కూడా ఇలానే చేయాల‌నే ధోర‌ణిలో అన‌ధికార ఆదేశాలు జారీచేస్తున్నారు టీడీపీ అధినేత‌. అయితే, క‌ర్ణాట‌క మాజీ మంత్రి, గ‌నుల వ్యాపారి గాలి జ‌నార్ద‌న‌రెడ్డికి అత్యంత స‌న్నిహితుడైన రాయ‌దుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రా రెడ్డి ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో బీజేపీ అభ్య‌ర్థికి ప్ర‌చారం చేస్తున్నారు.

బీజేపీ నేత‌ల గెలుపుకోసం మొళ‌కాల్మూరు, బ‌ళ్లారి నియోజ‌క‌వ‌ర్గాల‌లో కాపు ప్ర‌చారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ .. ఆయ‌న బీజేపీ అభ్య‌ర్థుల‌కు ఓటేయాల‌ని కోరుతున్నారు. మొళ‌కాల్మూరులో గాలి అనుచ‌రుడు బీ శ్రీరాములు, బ‌ళ్లారి సిటీ నియోజ‌క‌వ‌ర్గంల గాలి జ‌నార్ద‌న రెడ్డి సోద‌రుడు సోమ‌శేఖ‌ర‌రెడ్డి బీజేపీ అభ్య‌ర్థులుగా బ‌రిలో నిలిచారు. దీంతో ఈ ఇద్ద‌రి త‌ర‌ఫున కాపు రామ‌చంద్రారెడ్డి రెండు రోజులుగా ప్ర‌చారం చేస్తున్నారు. ఇక్క‌డ కొన్ని వార్డుల‌కు కాపు ఏకంగా ఇంచార్జ్ బాధ్య‌త‌లు తీసుకున్నారు. నిజానికి ఈ ప‌రిణామం వైసీపీకి ఏపీలో మైన‌స్‌గా మారే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని నేప‌థ్యంలో కేంద్రంపై పోరాడుతున్నామ‌ని చెబుతున్న జ‌గ‌న్ ఈ క్ర‌మంలోనే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చి సంచ‌ల‌నం రేపారు. ఇక‌,త‌న ఎంపీల‌తో రాజీనామాలు చేయించారు. ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో నిరాహార దీక్ష చేయించారు. మ‌రి ఇంత చేస్తున్న జ‌గ‌న్‌కు ఇప్పుడు కాపు ప్ర‌చారంతో మైన‌స్ మార్కులు వేయాల‌ని చూస్తోంది టీడీపి. అయితే, టీడీపీ ఎత్తుగ‌డ‌లను తాము స‌మ‌ర్ధంగా ఎదుర్కొంటామ‌ని అంటున్నారు వైసీపీ నేత‌లు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.