తెలంగాణలో షర్మిల రాజకీయంగా సునామి సృష్టిస్తూనే ఉన్నారు.ఆమె పార్టీ ఏర్పాటు అనివార్యం కావడంతో, ఏ పార్టీ ఆ ప్రభావానికి గురవుతుంది ? ఎవరెవరు నష్టపోతారనే దాని పైన చర్చ జరుగుతోంది.ఇదిలా ఉంటే మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణ లో తాను స్థాపించబోయే పార్టీ పేరును ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.దానిలో భాగంగానే ముందుగా అన్ని జిల్లాలకు చెందిన కీలక నాయకులు, వైఎస్సార్ అభిమానులు, తన స్నేహితులతోనూ షర్మిల ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ, తెలంగాణలో కొత్త పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి ? ఏ ఏ అంశాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలి ? రాజకీయంగా ఏ విధంగా పై చేయి సాధించాలి ? ఇలా అనేక అంశాల పైన చర్చిస్తున్నారు.కొద్ది రోజులుగా షర్మిల అదే వ్యవహారంపై బిజీబిజీగా గడుపుతున్నారు.ప్రస్తుతం తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టిఆర్ఎస్, బిజెపి తో పాటు ,కాంగ్రెస్ ప్రభావాన్ని తట్టుకుంటూ, అన్ని రకాలుగా వచ్చే ఎన్నికల నాటికి బలమైన పార్టీగా జనాల్లో ముద్ర వేయించుకోవాలని షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వస్తున్నారు.
దీనిలో భాగంగానే షర్మిల రాజకీయంగా తన పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు 11 ప్రశ్నలను ఎంచుకున్నారు.ఆ ప్రశ్నలను తన సన్నిహితులను అడిగి వారి సమాధానాన్ని నోట్ చేసుకుంటున్నారు.
అందరి అభిప్రాయాలను పరిశీలించి దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని చూస్తున్నారు.
- తెలంగాణలో వైఎస్సార్ అభిమానులు ఎదుర్కొంటున్న కష్టాలు ? వాటి పరిష్కార మార్గాలు.
- మన రాజకీయ నిర్ణయం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ?
- మీ అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పనులు ఏంటి ?
- తెలంగాణ సమాజం ఉద్యమకారుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలు ఏమిటి ? వాటికి ఎలాంటి సమాధానం చెప్పాలి ?
- రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా మారాలంటే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పోరాడాల్సిన అంశాలు ఏంటి ?
- సంస్థాగతంగా బలపడేందుకు క్యాడర్ ను నిర్మించుకోవడానికి చేయాల్సిన పనులు ఏంటి ?
- తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడాలంటే నియోజకవర్గస్థాయిలో ఏం చేయాల్సి ఉంటుంది ?
- సంక్షేమ పాలను మళ్లీ తీసుకురావాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి ?
- ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ ను, టిఆర్ఎస్ ను ఎలా ఎదుర్కోవాలి ? దానికి మీరిచ్చే సలహా ఏమిటి ?
- రాష్ట్రంలో బీజేపీ ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి ? దానికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి ?
- వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి ?