వైసీపీలో బాబాయ్ హావ ! అబ్బాయ్ ఆగ్రహం !       2018-07-02   23:00:07  IST  Bhanu C

రాబోయే ఎన్నికల్లో పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని వైసీపీ అధినేత జగన్ ఎండనక వాననకా తిరుగుతూ ప్రజల్లో సానుభూతి సంపాదిస్తూ .. దాన్ని ఎన్నికల్లో ఓట్ల రూపంలో వైసీపీకి పడేలా చేసి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు. జగన్ పాదయాత్ర ఫలితమే ఏమో కానీ వైసీపీ కూడా ఈ మధ్యకాలంలో బాగానే పుంజుకుంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారం చేజిక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అనేక సర్వేలు , విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ లో హుషారు కూడా పెరిగింది. అయితే ఇదే సమయంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి వ్యవహారం తెరమీదకు వచ్చింది.

పార్టీ అధికారంలోకి వస్తున్న ఆశలు పెరుగుతున్న సమయంలో వైసీపీలో పైరవీలు మొదలయ్యాయి. నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే విషయాల్లో జగన్ బంధువుల జోక్యం మితిమీరిపోయిందట. ముఖ్యంగా జగన్ బాబాయ్ వైవీ ఈ వ్యవహారాల్లో తన రాజకీయం చుపిస్తున్నాడంట. జగన్ జైలులో ఉన్నప్పుడు అన్నీ తానై పార్టీని నడిపించి పార్టీలోనూ .. జగన్ దృష్టిలోనూ వైవీ సుబ్బారెడ్డి మంచి మార్కులే సంపాదించాడు. కానీ ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలో వైవీ తలదూర్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడం జగన్ దృష్టికి రావడంతో వైవీకి గట్టిగానే క్లాస్ పీకినట్టు సమాచారం.

ప్రకాశం జిల్లాతో పాటు, మరి కొన్ని జిల్లా వ్యవహారాల్లో వైవీ సుబ్బారెడ్డి వేలు పెడుతూ.. తనకు నచ్చిన వారికి పార్టీ టికెట్లు కట్టబెట్టే పనిలో ఉన్నాడట వైవీ. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలో ఇన్ చార్జి మార్పు విషయంలో పాదయాత్రలో ఉన్న జగన్ మోహన్ రెడ్డితో వైవీ సుబ్బారెడ్డి సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. తనకు నచ్చిన వారికి అనుకూలంగా రిపోర్టులు ఇస్తూ, తనకు నచ్చని వారికి నెగిటివ్ రిపోర్టులు ఇస్తున్నారట వైవీ. ఈ వ్యవహారంపై జగన్ కు కూడా ఆగ్రహం వచ్చిందని వైసీపీలో ప్రచారం జరుగుతోంది.

కేవలం ఆ ఒక్క జిల్లాలోనే కాకుండా గోదావరి జిల్లాల వ్యవహారాల్లో కూడా వైవీ సుబ్బారెడ్డి జోక్యం చేసుకుంటున్నాడట. గత ఎన్నికల్లోనూ అభ్యర్థుల ఎంపిక విషయాల్లోనే తేడాలు రావడంతో పార్టీ ప్రతి చోటా స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. కానీ ఈ సారి మరింత జాగ్రత్తగా వెళ్లాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి సమయంలో వైవీ వంటి వారి జోక్యం వల్ల మళ్లీ పాత కథ రిపీట్ అవుతుందేమో అని జగన్ భయపడుతున్నాడట. ఇక అభ్యర్థుల ఎంపికల్లో జోక్యం చేసుకోబోనని వైవీ చెప్పేశాడట. ఇలా ఉంది వైసీపీ వ్యవహారం ! ముందు ముందు ఇంకెన్ని తలపోట్లు వస్తాయో ..? వాటన్నిటిని ఎదుర్కోవడానికి జగన్ సిద్ధంగా ఉండాలి లేకపోతే మళ్ళీ గత ఎన్నికల సీనే రీపీట్ అవుతుంది.