జగన్ పాదయాత్ర పొడిగింపు..? ఆ నిర్ణయం చెప్పలేకే ఈ నిర్ణయం !  

వైసీపీని అధికారంలోకి తీసుకురావాలనే దృఢ నిశ్చయంతో పాటు క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర పేరుతో గత ఏడాది నవంబరు 6వ తేదీన కడప జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభించి ఇప్పటికి 11 నెలలు పూర్తయింది. ముందుగా అనుకున్న ప్రకారం యాత్రను నవంబరు 5వ తేదీకి ముగించాలి. దీనివల్ల ఏడాది పాటు ప్రజల్లో ఉన్నట్లు ఉంటుందని యాత్రను అలా ప్లాన్ చేశారు. అయితే యాత్రకు ప్రతి జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తోంది. మరోవైపు పండగలు, తుఫాను ల వంటి సమయంలో యాత్రకు విరామమివ్వాల్సి వచ్చింది. ఈ యాత్రలో ఉండగానే పార్టీ ప్రక్షాళన చేస్తూ సీట్ల కేటాయింపుకు కూడా జగన్ తెరలేపి సంచలనం సృస్తిస్తున్నారు.

Ys Jagan Padayatra Extends Reason Telangana Elections-

Ys Jagan Padayatra Extends Reason Telangana Elections

అయితే జగన్ నిర్వహిస్తున్న పాదయాత్ర మరి కొంతకాలం ముందుకు పొడిగించాలని అనుకుంటున్నారట. అంటే… తెలంగాణలో ఎన్నికలు ముగిసేంత వరకూ పాదయాత్ర చేయాలనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో డిసెంబరు 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 11వ తేదీన కౌంటింగ్ ను నిర్వహిస్తారు. అప్పటి వరకూ పాదయాత్రలోనే ఉండాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన రూట్ మ్యాప్ లో కూడా కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికల సందడి నెలకొంది. అయితే ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని జగన్ భావిస్తున్నారు. పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే దృష్టి పెట్టాలని జగన్ భావిస్తున్నారు . తెలంగాణ ఎన్నికలలో జోక్యం చేసుకోవడం అనవసరమని ఆయన భావిస్తున్నారు. పాదయాత్రను ముందుగానే ముగిస్తే తెలంగాణ ఎన్నికల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే యాత్రను పొడిగించాలన్న నిర్ణయానికి జగన్ వచ్చారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్ప పాదయత్ర విజయనగరం జిల్లాలో జరుగుతోంది. తొలుత రూపొందించిన రూట్ మ్యాప్ ప్రకారం కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా యాత్రను రూపొందించాలని నిర్వాహకులను జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది.