జ‌గ‌న్ ఆ విష‌యంలో అప్‌డేట్ అవ్వాలా?   YS Jagan Need To Reduce His Overconfidence     2017-01-09   01:53:36  IST  Bhanu C

మారుతున్న కాలానికి అనుగుణంగా నేత‌లు కూడా త‌మ ప్ర‌సంగాలు, హావ‌భావాలు మార్చుకుంటూ వ‌స్తుంటారు. కానీ ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్.. దీనిని ఏమాత్రం ఫాలో అవ్వ‌డం లేదంటున్నారు విశ్లేష‌కులు. రాజ‌కీయ నాయ‌కులు ఒక్కొక్క‌రిదీ ఒక్కో స్టైల్‌! ఇది ప్ర‌సంగాల విష‌యంలోనూ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఒకొక్క‌రు ఆవేశంగా.. మ‌రికొంత‌మంది సూటిగా స్ప‌ష్టంగా.. ఇంకొంద‌రు శాంతంగా చెప్ప‌ద‌లుచుకున్న విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా చెబుతారు. అయితే జ‌గ‌న్ మాత్రం.. కొత్త విష‌యాల‌పై ఫోక‌స్ పెట్టకుండా.. ఒకే విష‌యాన్నిప‌దేప‌దే చెబుతూ.. పాత చింత‌కాయ ప‌చ్చ‌డిని గుర్తుచేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

`న్యాయం, ధ‌ర్మానిదే గెలుపు`, `రెండేళ్ల‌లో మ‌న ప్ర‌భుత్వం వ‌స్తుంది. అప్పుడు మీ క‌ష్టాల‌న్నీ తీరిపోతాయి`, `చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని బంగాళాఖాతంలో క‌లిపేయండి`.. ఇవి జ‌గ‌న్ ఊత‌ప‌దాలుగా మారిపోయాయి! ప‌బ్లిక్ ఫంక్ష‌న్ కావొచ్చు.. ఓదార్పు యాత్ర కావొచ్చు.. మ‌రింకేద‌న్నా కావొచ్చు ఇవి లేకుండా ఆయ‌న ప్ర‌సంగ‌మే ఉండ‌దంటే అతి శ‌యోక్తి కాదు. ముఖ్యంగా చంద్ర‌బాబు చేసే ప్ర‌సంగాల్లోనూ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసినా.. అవి పూర్తి రాజ‌కీయ ప‌రిణ‌తితో, వైసీపీని కార్న‌ర్ చేసేలా ఉంటాయి. అయితే జ‌గ‌న్ ప్ర‌సంగాల్లో ఇలాంటివి లోపించాయ‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం.

నాయ‌కుడు ప్ర‌సంగాల‌తో జ‌నాల‌ను ఆక‌ట్టుకోవాలి. అలాగే సినిమాలోని క‌థ ఎప్పుడూ మారుతూ ఉండాలి. ఒక‌వేళ ఉప‌న్యాసం రొటీన్‌గా ఉన్నా.. క‌థ పాత‌దే అయినా.. ప్ర‌జ‌లు ఏమాత్రం స‌హించ‌రు. అయితే రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఏళ్లు గ‌డుస్తున్నా ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ చేసే ప్ర‌సంగాల్లో ప‌రిణ‌తి మాత్రం క‌నిపించ‌డం లేదు.

`రెండేళ్ళలో మన ప్రభుత్వం వస్తుంది….అన్నీ అద్భుతాలే జరిగిపోతాయి` అని చెప్పడం తగ్గించాల‌ని విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ప్ర‌ధాని మోడీ, సీఎం చంద్ర‌బాబు కూడా తాము ఎన్నిక‌ల్లో గెలిస్తే అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో అద్భుతాలు సృష్టిస్తామ‌ని ప్ర‌చారం చేసుకున్న వాళ్లేన‌ని.. ప్ర‌స్తుతం వాస్త‌వ ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో.. అంద‌రికీ తెలిసిందేన‌ని గుర్తుచేస్తున్నారు. దీంతో జ‌గ‌న్ కూడా ప్ర‌జ‌ల‌కు అదే చెబితే.. బాబు, మోడీ చూపించిన సినిమానే గుర్తొస్తుందంటున్నారు. అందుకే వాస్త‌వికంగా మాట్లాడాల‌ని సూచిస్తున్నారు.