జగన్ రాజకీయం రివర్స్ అవుతోందా ..     2018-07-17   11:10:53  IST  Sai Mallula

వైసీపీ అధ్యక్షుడు జగన్ రాజకీయం ఆ పార్టీ నాయకులకు మింగుడు పడడంలేదు. జగన్ తాను తీసుకున్న నిర్ణయాలు అన్ని వ్యూహాత్మకం అని అనుకున్నా.. తప్పటడుగులుగానే పడుతున్నాయి. ఒకవైపు యాత్ర పేరుతో ప్రజల్లో మంచి మార్కులే కొట్టేస్తున్నా .. పార్టీకి మైలేజ్ తీసుకువచ్చే విషయాల్లో మాత్రం దిద్దుకోలేని తప్పులు చేస్తున్నాడు. వైసీపీకి ప్రస్తుతం జగన్ నుంచే ముప్పు పొంచి ఉందనే అనుమానాలు ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతోంది.

మొదటి నుంచి జగన్ ప్రభుత్వం మీద అలుపెరగకుండా పోరాటాలు చేస్తూనే ఉన్నాడు. అయినా ఆయనకు అనుకున్నంత స్థాయిలో కలిసిరాలేదు. విభ‌జ‌న హామీల్లో ప్రధానంగా ప్రత్యేకహోదా కోసం నాలుగేళ్లుగా ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వివిధ రూపాల్లో ఆందోళ‌న‌లు చేస్తూ వ‌చ్చారు. యువ‌భేరీలు, నిర‌శ‌న కార్యక్రమాలు చేశారు. కేంద్రంపై జ‌గ‌న్ అవిశ్వాస తీర్మానం పెట్టడం, టీడీపీ కూడా అదే బాట‌లో న‌డ‌వ‌డం, దేశ‌స్థాయిలో సంచ‌ల‌నం క‌లిగించాయి. ఆ త‌ర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయ‌డం, ఆమోదించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ప్రస్తుతం పార్లమెంట్ వ‌ర్షాకాల‌ సమావేశాలు బుధ‌వారం ప్రారంభం కానున్న పార్లమెంట్ స‌మావేశాల్లో కాంగ్రెస్ స‌హా టీడీపీ మ‌ళ్లీ అవిశ్వాస తీర్మానం ప్రవేశం పెట్టేందుకు సిద్ధమ‌య్యాయి. దీంతో ఢిల్లీలో రాజకీయ కాకా మొదలయ్యింది.

YS Jagan Mistakes Putting Party Into Trouble-

YS Jagan Mistakes Putting Party Into Trouble

టీడీపీ రాజకీయంగా లబ్ది పొందేందుకు క‌మిటీలు ఏర్పాటు చేసుకొని అవిశ్వాస తీర్మానానికి మ‌ద్దతు కూడ‌గ‌డుతూ ప్రత్యేకహోదా కోసం ఏదో చేస్తున్న భ్రమ క‌లిగిస్తుంటే, ప్రతిప‌క్ష వైసీపీ చేతులుకట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక హోదా కోసం మొద‌టి నుంచి ఉద్యమిస్తున్నవైసీపీ జగన్ తొందరపాటు నిర్ణయాలతో పార్టీకి రావాల్సిన క్రెడిట్ ను టీడీపీకి వెళ్లేలా చేసింది. దీనికి జగన్ తొందరపాటు నిర్ణయాలే కారణం.

పార్లమెంట్ ఆవ‌ర‌ణ‌లో స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు త‌మ తాజా మాజీ ఎంపీలు నిర‌స‌న కార్యక్రమాలు చేస్తార‌ని వైసీపీ ప్రక‌టించింది. పార్లమెంట్‌లో ఉండి పోరాడేందుకు అవ‌కాశం ఉన్న ప‌ద‌వుల‌ను వదులుకుని పోరాటం చేస్తాను అందడం ఎంతవరకు కరెక్ట్ అనేది జగన్ తెలుసుకోవాలి. జ‌గ‌న్ ప్రారంభించిన ప్రత్యేకహోదా ఉద్యమాన్ని చంద్రబాబు నాలుగేళ్ల త‌ర్వాత అందుకుని త‌న తప్పుని ప్రజల్లో కప్పి పుచ్చుకోవడమే కాకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఏపీలో పోరాడుతున్న ఏకైక పార్టీ టీడీపీ అనే భావనను ప్రజల్లో కలిగించగలిగాడు. కానీ ఇటువంటి రాజకీయ ఎత్తుగడలు వెయ్యడంలో మాత్రం జగన్ ఇంకా ఓనమాలు దిద్దే దగ్గరే ఉండిపోయేడు.