జ‌గ‌న్ `క‌మ్మ` జ‌పం.. పెద్ద క‌థే ఉందే..!       2018-04-25   23:56:13  IST  Bhanu C

రాజ‌కీయాల్లో వ్యూహ ప్ర‌తివ్యూహాలు కామ‌న్‌. అధికారంలోకి వ‌చ్చేందుకు విప‌క్షాలు, అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు అధికార ప‌క్షాలు ఎప్ప‌టిక‌ప్పుడు పోటీ ప‌డుతూనే ఉంటాయి. ఏపీలోనూ ప‌రిస్థితి ఇలానే ఉంది. అధికార పార్టీ టీడీపీ త‌న అధికారాన్ని తిరిగి నిల‌బెట్టుకునేందుకు నానా ప్ర‌యాస ప‌డుతోంది. వివిధ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతోంది. ఇక‌, విప‌క్షం వైసీపీ అధినేత వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తీవ్ర ప్ర‌యాస ప‌డుతున్నారు. ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లు, వివిధ ప‌థ‌కాల‌పై హామీలు, వివిధ పార్టీల నుంచి నేత‌ల‌ను పార్టీలోకి ఆహ్వానించ‌డం వంటివి జ‌గ‌న్ చేప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలోనే టీడీపీ ఓటు బ్యాంకును భారీ ఎత్తున దెబ్బ కొట్టేందుకు జ‌గ‌న్ వ్యూహం సిద్ధం చేసుకున్నాడు.

దీనిలో భాగంగా టీడీపీకి అనుకూలంగా ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని త‌న వైపు తిప్పుకొనేందుకు రెడీ అయ్యాడు. ఏపీలోని మొత్తం 25 పార్లమెంట్ సీట్ల‌లో రిజ‌ర్వుడు టికెట్లు పోను మిగిలిన 20 సీట్ల‌లో ఐదు సీట్ల‌ను క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వైసీపీ నేత‌లే చెబుతున్నారు. ప్ర‌ధానంగా టీడీపీకి ఎక్క‌డ అనుకూలంగా ఉంటుందో చూసుకుని, అక్క‌డే చంద్ర‌బాబుకు ఝ‌ల‌క్ ఇచ్చేలా జ‌గ‌న్ ప్లాన్ చేసుకున్న‌ట్టు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, విశాఖపట్నం సీట్లను క‌మ్మ సామాజిక వ‌ర్గానికి జ‌గ‌న్ కేటాయించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే, విశాఖ ఎంపీ సీటును మాత్రం విజ‌య‌సాయి రెడ్డి కోరుతున్న‌ట్టు స‌మాచారం. దీంతో ఆ సీటును మిన‌హాయిస్తే.. మ‌రో సీటును క‌మ్మ వ‌ర్గానికి కేటాయిస్తార‌ని అంటున్నారు.

గత ఎన్నికల సమయంలో విజయవాడ నుంచి కోనేరు ప్రసాద్‌ను, రాజమండ్రి నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరిని ఎన్నికల బరిలో దించారు. అయితే వీరిద్దరూ ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆ ఎన్నిక‌ల్లో క‌మ్మ వ‌ర్గానికి మంచి ప‌ట్టున్న గుంటూరు, న‌ర‌సారావుపేట సీట్ల‌ను కూడా జ‌గ‌న్ కాపు, రెడ్ల‌కు ఇచ్చాడు. ఈ స్ట్రాట‌జీతో ఆయ‌న కీల‌క‌మైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బాగా దెబ్బ‌తిన్నాడు. దీంతో ఇప్పుడు టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉంటూ చంద్ర‌బాబుకు బ‌లంగా కొమ్ముకాస్తోన్న క‌మ్మ వ‌ర్గాన్ని త‌న వైపున‌కు తిప్పుకునేందుకు జ‌గ‌న్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాడు.

తాజాగా…ఇప్పుడు..ఈ వర్గాన్ని తన దరి చేర్చుకుని చంద్రబాబును దెబ్బతీయాలని భావిస్తున్న జ‌గ‌న్‌.. ఈ వర్గానికి చెందిన వారికి వల విసురుతున్నారట. ఇప్ప‌టికే గుంటూరు జిల్లాలో గుంటూరు ఎంపీ సీటు ఈ వ‌ర్గానికే చెందిన విజ్ఞాన్ సంస్థ‌ల అధినేత లావు ర‌త్త‌య్య త‌న‌యుడు లావు శ్రీకృష్ణ దేవ‌రాయులుకు ఇచ్చాడు. ఇక ఈ జిల్లాలో 5-6 అసెంబ్లీ సీట్లు క‌మ్మ‌ల‌కే ఇస్తున్నాడు. ఇక కృష్ణా జిల్లాలో యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు, య‌ల‌మంచిలి ర‌వి, వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌ల‌కు కూడా టిక్కెట్లు ఖ‌రారు చేస్తున్నాడు.

ఇక ఎంపీ సీట్ల విష‌యానికి వ‌స్తే గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి కూడా జ‌గ‌న్ టికెట్ ఆఫ‌ర్ చేస్తున్నాడు. అదేవిధంగా పార్టీ మారే ఆలోచ‌న ఉంటే.. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న పురందేశ్వ‌రి, కావూరి సాంబ‌శివ‌రావులు వైసీపీలో చేరే అవ‌కాశం ఉంటే వారికి కూడా ఎంపీ సీట్లు ఇచ్చేందుకు తాను సిద్ధ‌మేన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించిన‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌.. క‌మ్మ గా క‌మ్మ‌ల‌కు లైన్ వేస్తున్నాడ‌ని అర్ధ‌మ‌వుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

,