జగన్ లో మార్పు వచ్చిందా ..అదే వైసీపీకి కలిసొస్తుందా ..?     2018-07-22   10:47:27  IST  Sai Mallula

వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే..? మీరు నాకు ఏమీ చెప్పొద్దు నేను చెప్పింది వినండి చాలు ! నా నిర్ణయమే ఫైనల్ .. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. మీరు చెప్తే నేను వినాలా అనే ధోరణిలో ఉండేవాడు. అందుకే, చాలామంది సీనియర్లు వైసీపీలోకి వెళ్లి, అక్కడ ఇమడలేక తిరిగొచ్చేశారు. నిజానికి వైసీపీలో చేరిన వారంతా ఇప్పుడు పార్టీలోనే ఉండిఉంటే వైసీపీ ఇంకా బలంగా ఉండేదేమో. గత ఎన్నికల సమయంలో కూడా జగన్ ఇదే తీరుతో ఉండడంతో పార్టీ అధికారానికి దూరం అయ్యింది. ఆ తరువాత జగన్ ఆతర్మధనంలో తన తీరు మార్చుకోకపోతే ఈ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి రావొచ్చని తేలడంతో జగన్ లో మార్పు మొదలయ్యింది.

ఈ మధ్య కాలంలో జగన్ వైకిరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఏపీలో వైసీపీ గెలవాలంటే జగన్ ఆయన అనుకున్నదానితో పాటుగానే, పార్టీ సీనియర్లు చెప్పింది కూడా తప్పకుండా వినాల్సి ఉంటుంది. అయితే, ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటికి వచ్చిన తర్వాత, ఆ స్థానాన్ని వైసీపీ భర్తీ చేస్తుందని పార్టీ నేతల దగ్గర ప్రస్తావించాడట జగన్. ప్రత్యేకహోదా ఇవ్వని కారణంగానే, దాన్నే సాకుగా చూపుతూ చంద్రబాబు బయటికి వచ్చినందున, ఇప్పుడు కొత్తగా మనం ఎన్డీయేతో జతకడితే ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారని సీనియర్లు చెప్పినా ఒకప్పుడు జగన్ వినిపించుకోలేదట. కానీ ఇప్పుడిప్పుడే జగన్ సీనియర్లు చెప్పిందే నిజం అని గ్రహించాడు. ఇకపై సీనియర్లు సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యాడు.

YS Jagan Is Changed Completely-

YS Jagan Is Changed Completely

తాజాగా ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, అసలు బీజేపీతో కలిసే ఉద్ధేశ్యమే లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడంతో పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారట. అయితే, బీజేపీతో పొత్తు పెట్టుకోబోమని గతంలోనే ఓసారి జగన్ చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ, ఆ మాటలు జనాల్లోకి వెళ్లలేదని పార్టీ నేతలు భావించారు. తాజాగా జగన్ మరోసారి చాలా స్పష్టంగా ప్రకటించడంతో పలువురు సీనియర్లు ఊపిరి పీల్చుకుంటున్నారట.

తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇకపై కేంద్రాన్ని కూడా నిలదీయాలని, బీజేపీని ఎంతవీలైతే అంతలా విమర్శించాలని, చంద్రబాబుతో సమానంగా మోదీపై మాటల దాడిని పెంచాలన్న నిర్ణయానికి వచ్చారట. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ మోసం చేస్తే, ఇప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేసిందన్న వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విమర్శల అస్త్రాన్ని ఎక్కుపెట్టాలని జగన్ పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం.

మోదీపై, బీజేపీపై ఆచితూచి వ్యవహరిస్తున్న జగన్, ఇంకా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గ్రహించి ఇకపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై విల్లు ఎక్కుపెట్టాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారట. ఇందులో భాగంగానే, ఈ నెల 24న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన జగన్ మరింత స్పీడ్ పెంచాలని చూస్తున్నాడు. జగన్ ఆలస్యంగా తీసుకున్నా, ఈ నిర్ణయం పార్టీకి మేలు చేస్తుందని సీనియర్ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.