ఓరి నాయనో... జగన్ హామీలు చూస్తే దిమ్మతిరగాల్సిందే !       2018-05-22   07:03:37  IST  Bhanu C

నరంలేని నాలుక నానా రకాలుగా మాట్లాడుతుంది. అదే రాజకీయ నాలుక అయితే ఇక చెప్పేది ఏముంది ..? అడ్డు అదుపులేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. సాధ్యాసాధ్యాలు గురించి పక్కనపెడితే .. అడిగిన వారికి అడగనివారికి కూడా హామీలు ఇవ్వడంలో వైసీపీ అధినేత అందరికంటే ముందు వరుసలో నిలబడిపోతున్నాడు. జగన్ ఇస్తున్న హామీలు చూసి ఆ పార్టీవారే ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఇది సాధ్యమేనా ..? మనోడేంటి ఇలా వరాలు ఇచ్చేస్తున్నాడు. రేపు కనుక ప్రభుత్వం వస్తే వారంతా పీక పట్టుకుని మరీ నిలేస్తారు అంటూ గుసగుసలాడుకుంటున్నారు.

జగన్ ఇస్తున్న హామీలు చూసుకుంటే.. ఎక్కువ నగదు హామీలే. నెలనెలా మీకు అంత ఇస్తా ఇంత ఇస్తా అంటూ హామీలు గుప్పిస్తున్నాడు. తాజాగా తాడేప‌ల్లి గూడెంలో జ‌రిగిన పాద‌యాత్ర‌లో కూడా కొన్ని వ‌రాలు ఇచ్చారు. వాటిల్లో ఒక‌టి… దీర్ఘ కాల వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారికి నెలకి రూ. 10 వేలు పింఛన్ ఇస్తా అంటూ హామీ ఇచ్చేసాడు. అలాగే జగన్ గత హామీలు పరిశీలిస్తే.. కొత్తగా న్యాయవాదిగా పేరు నమోదు చేసుకునే నెలనెలా ఐదువేలు సైఫండ్ ఇచ్చేస్తాం అన్నాడు.

కృష్ణాజిల్లా కైక‌లూరు పాద‌యాత్ర‌లో మాట్లాడుతూ.. మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే మే నెల‌లో ప్ర‌తీ రైతు కుటుంబానికీ రూ. 12,500 ఇచ్చేస్తానంటూ హామీ ఇచ్చారు. అంత‌కు ఓవారం ముందు… పాద‌యాత్ర‌లో భాగంగా కొంత‌మంది ఆటోడ్రైవ‌ర్లు క‌లిసి మాట్లాడారు. సొంత ఆటో క‌లిగి ఉన్న ప్ర‌తీ డ్రైవ‌ర్ కూ రూ. 10 వేలు చొప్పున ప్ర‌తీయేటా త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చేస్తామ‌ని వ‌ర‌మిచ్చాడు.

గుడివాడలో పాద‌యాత్ర సాగుతుండ‌గా కొంత‌మంది నాయి బ్రాహ్మ‌ణులు జ‌గ‌న్ ను క‌లిసి, క‌ష్టాలు చెప్పుకున్నారు. వారికీ ఓ వ‌రం ఇచ్చేశారు. ప్ర‌తీ షాపుకీ రూ. 10 వేలు ఇచ్చే ఏర్పాటు చేస్తా అంటూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. ఇలా ఎవరు తమ సమస్య చెప్పుకున్నా డబ్బు రూపేణా అంతా ..ఇంతా అని చెప్తున్నదే కానీ వారు అడిగింది సాధ్యమా కాదా అనే విషయంపై జగన్ ఆలోచన చేయడంలేదు. ఇక ముందు ముందు పాదయాత్ర లో ఎన్ని చిత్రాలు చోటుచేసుకుంటాయో చూడాలి. జగన్ ఇస్తున్న హామీలు అమలు చెయ్యాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదు ఏకంగా దేశ బడ్జెట్ అంతా ఏపీకి తరలించాల్సిందే అని వ్యంగ్య వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.