జగన్ మళ్లీ మళ్లీ అదే తప్పు... చేస్తూనే ఉన్నాడా...?   YS Jagan Doing That Mistake Again And Again     2018-11-09   12:54:20  IST  Sai M

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారయ్యింది ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై ప్రజల్లో అభిమానం ఉన్నా… దాన్ని సరైన క్రమంలో పార్టీ ఉపయోగించుకోలేకపోతోంది అన్న అపవాదు మూటగట్టుకుంటోంది. ఒక వైపు పాదయాత్ర చేస్తూ జగన్ పార్టీకి మైలేజ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. బలమైన అధికార పార్టీ టీడీపీని సరైన క్రమంలో ఎదుర్కోలేక పోతోంది. దీనికి కారణం జగన్ సరైన క్రమంలో పార్టీ నాయకులను నడిపించలేకపోతున్నాడు అనే భావన కలుగుతోంది. అంతే కాకుండా… ఇటీవల జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి వ్యవహారాన్ని కూడా… పార్టీ సరైన క్రమంలో ఉపయోగించుకోలేకపోయారు అనే ఫీలింగ్ కలుగుతోంది.

జగన్ ఆ మధ్యన విశాఖలో పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలన్నీ విజయవంతం అయ్యాయి. జగన్ పాదయాత్రకు కూడా భారీ స్థాయిలో జనాలు ఆదరించారు. అంతే కాదు ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నది కూడా అర్ధం అవుతోంది. ప్రస్తుతం… టీడీపీ ఎమ్మెల్యేలపైన ఎక్కడ చూసినా వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. కానీ దాన్ని వైసీపీ సరైన విధంగా ఉపయోగించలేకపోతోంది.గత ఎన్నికల్లో ఈ లోపాలే పార్టీకి పెద్ద దెబ్బ కొట్టాయి.ఆ తరువాత నుంచైనా సరైన గుణపాఠాలు వైసీపీ అధినాయకత్వం నేర్చుకోలేదు. జగన్ ఇక్కడకు అనేక సార్లు వచ్చి నిర్వహించిన ఆందోళనలు అన్నీ జయప్రదం అయ్యాయి. ప్రత్యేక హోదాపై చేపట్టిన జై ఆంధ్రప్రదేశ్ భారీ సభ జనంతో పోటెత్తింది. అయినా ఆ తరువాత ఫ్యాన్ పార్టీ ఆ ఊపుని కొనసాగించలేకపోయింది.

YS Jagan Doing That Mistake Again And Again-

టీడీపీలో వైసీపీ పై ఎదురు దాడి, ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేసే నాయకులు అనేక మంది ఉన్నారు. కానీ… వైసీపీ లో ఆ స్థాయి నాయకులు పెద్దగా కనిపించడం లేదు. పార్టీ పరంగా పదవులు ఇచ్చి బాధ్యతలు అప్పగించినా… నాయకులు జనంలోకి వెళ్ళడం లేదు. పైగా ఎవరూ కూడా వారి నియోజకవర్గం దాటి వస్తే పలకరించే స్థాయి లేదు. ఇక ఇంచార్జ్ లను తీసుకుంటే డబ్బుంది అన్న ఒక్కటే అర్హత తప్ప వారి ముఖాలు ఏవీ జనాలకు తెలియడం లేదు. జగన్ కూడా ఇటువంటి నాయకులతోనే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధం అవ్వడం ఎంతవరకు పార్టీకి కలిసి వస్తుందో తెలియడం లేదు. పార్టీలోనూ… తనలోనూ అంతర్గత లోపాలను సరిదిద్దుకుంటే సరే లేకపోతే మళ్ళీ గత ఎన్నికల ఫలితాలే పునరావృతం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఈ విషయాలపై జగన్ దృష్టిసారిస్తాడో లేదో చూడాలి.