జగన్ తాజా నిర్ణయం వైసీపీని ముంచుతుందా ..? తేల్చుతుందా ..?       2018-05-22   04:05:21  IST  Bhanu C

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ దపా ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న ఆ పార్టీ అందుకు అనుగుణంగా తన వ్యూహాలను మార్చుతోంది. ఇప్పటికే ప్రజల మద్దతు కూడగట్టేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగేందుకు కాళ్లకు పనిచెప్పాడు. ఈ యాత్రలోనే జగన్ ఎన్నో విషయాల మీద అవగాహన తెచ్చుకున్నాడు. పార్టీ ఏ విషయాల్లో బలంగా ఉంది ఏ విషయాల్లో బలహీనంగా ఉంది అనే విషయాలను జగన్ గ్రహించాడు. దానికి అనుగుణంగానే పార్టీలో కీలక మార్పులు చేర్పులు చేపట్టాలని డిసైడ్ అయిపోయాడు.

-

ముఖ్యంగా నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ ల మీద దృష్టిపెట్టిన జగన్ వారిలో ఎక్కువ శాతం మంది అనవసర భారంగానే భావిస్తున్నారట. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్నవారిని జగన్ ఇప్పటికే గుర్తించారు. వారికి ప్రాధాన్యం పెంచడం ద్వారా.. పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఇప్పటికే పార్టీ నుంచి ఫిరాయించి మళ్ళీ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న బలమైన నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అయితే ఇలా వచ్చే వారికి ఏదో ఒక పదవి ఇవ్వాలి కాబట్టి అనవసరమైన వారిని తప్పించి వారి పదవి వీరికి కట్టబెట్టాలని జగన్ స్కెచ్. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఇటువంటి వలసలు వైసీపీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండడంతో ఈ ప్లాన్ అమలు చెయ్యాలనే ఆలోచన జగన్ కి తట్టింది. పనిలో పనిగా ఏపీ అంతా ఈ ఫార్ములా ఉపయోగించి మంచి రిజల్ట్ కొట్టాలని స్కెచ్ వేసాడు వైసీపీ అధినేత.

ఈ కొత్త ఆలోచన కొంతమందికి అసంతృప్తి మిగిల్చినా.. ఇదే కరెక్ట్ అనే ఆలోచన జగన్ మదిలో ఉంది. ఇక రాయలసీమలోని కర్నూలు జిల్లా విషయానికి వస్తే… కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ లో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు. దీంతో ఇక్కడ అభ్యర్థి కోసం వైసీపీ వెతుకుతోంది. ఈ సీటును బీసీలకు ఇస్తానని జగన్‌ ప్రకటించాడు. కాబట్టి.. రామయ్యే అభ్యర్థి అవుతాడేమో అనే ఊహాగానాలున్నాయి. ఒకవేళ కోట్ల కుటుంబం వైసీపీలోకి వచ్చినా ..ఈ సీటును బీసీకే ఇవ్వాలని జగన్ఎం ఆలోచన. అలాగే నంద్యాల ఎంపీగా రెడ్డి సామజిక వర్గం వారిని ఎంపిక చేసే అవకాశం ఉండడంతో కర్నూల్ లో బీసీకి ఇవ్వక తప్పదు. ఇక ఇదే జిల్లాకు సంబంధించి ఇటీవలే వైసీపీలో చేరిన కాటసాని రామ్‌భూపాల్‌ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది స్పష్టతలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలోనూ ఇదే కన్ప్యూజన్ ఉంది. జగన్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం అందరూ స్వాగతిస్తారా ..? లేక అసమ్మతి రాగం వినిపిస్తారో చూడాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.