జగన్ లో ఈ మార్పు ఏంటి..? మంచిదేనా.. ముంచుతుందా ..?     2018-09-19   09:54:16  IST  Sainath G

విలువలు.. విశ్వసనీయత .. నమ్మిన వారి కోసం ఎంతకైనా తెగించడం.. మాట తప్పకపోవడం.. మడమ తిప్పకపోవడం ఈ డైలాగులన్నీ వింటే టక్కున గుర్తుకువచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్. ఎందుకంటే తరుచూ ఆయన నోటివెంట ఈ డైలాగులే వస్తూ ఉంటాయి. కానీ పార్టీలో మాత్రం ఆ సీన్ కనిపించడంలేదు. పార్టీని ముందునుంచి నమ్ముకుని, పార్టీకోసం తమ ఆస్తి పాస్తులను కరిగించుకుంటూ వస్తూ ఉన్నవారికి ఎన్నికల సమయంలో జగన్ పూచిక పుల్లలా తీసి పక్కనపెట్టేస్తున్నాడు. ఎవరెవరో కోట వారిని తీసుకువచ్చి టికెట్ వారికే అని చెప్పి కొత్త రాజకీయానికి తెరతీస్తున్నాడు.

దాదాపుగా 130 నియోజకవర్గాల్లో వైసీపీని నమ్ముకున్న పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఇదే తరహా అభిప్రాయం ఉంది. చిత్తూరులో సీకే బాబు దగ్గర నుంచి భీమిలిలో కర్రి సీతారం అనే నేత వరకూ అనేక మంది నేతల అనుచరులు జగన్ మాట తప్పడాన్ని మడమ తిప్పడాన్ని చూశారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఇంకా ఎంతమందిని జగన్ మోసం చేయబోతున్నాడో అని పార్టీలో ఒకటే చర్చ. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, చిలుకలూరిపేటలో మర్రి రాజశేఖర్, విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ, విశాఖ దక్షిణలో కోలా గురువులు మొదలయినవారంతా.. జగన్ రాజకీయానికి బలైన వారే.

గత నాలుగేళ్ల నుంచి వీళ్లందరికీ. టిక్కెట్ మీకే టిక్కెట్ మీకే అని చెప్పి తీరా ఇప్పుడు మీ దగ్గర సామాజిక, ఆర్థిక బలం లేదు అన్న కారణాలు చూపించి పక్కన పెట్టేస్తున్నారు. కొత్త కొత్త వాళ్లను తీసుకొచ్చి నియోజకవర్గబాధ్యతలు అప్పగించేస్తున్నారు. జగన్ వీరిని మాములుగా మోసం చేయడంలేదు. పార్టీ రాజకీయ కార్యక్రమాలు, తన పాదయాత్ర ఆ నియోజకవర్గం, ఆ జిల్లా దాటే వరకూ ఆయా నేతలకు గట్టి నమ్మకం కలిగిస్తున్నారు. తీరా వారితో పని అయిపోయాక కనీస సమాచారం లేకుండా ఇతరుల్ని ఇంచార్జిలుగా నియమించేస్తున్నారు. ఈ వ్యవహారం ఎవరికీ నచ్చడంలేదు. దాదాపుగా ప్రతీ జిల్లాలోనూ ఐదారు నియోజకవర్గాల్లో వైసీపీ తరపున సమన్వయ కర్తలుగా ఆరు నెలలకు మించి ఎవరూ ఎక్కువ ఉండటం లేదు. అందరూ డబ్బులు ఖర్చుపెట్టేసుకుంటున్నారు. వెళ్లిపోతున్నారు. నిజం చెప్పాలంటే వెళ్లగొట్టేస్తున్నారు. ఈ పరిణామాలతో కొద్దిరోజులుగా వైసీపీ తీవ్ర విమర్శలపాలవుతోంది.