జగన్ - పవన్ మిత్రులు కాబోతున్నారా ..?       2018-06-22   23:13:48  IST  Bhanu C

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనే దానికి ఇప్పుడు వైసీపీ – జనసేన నిదర్శనం కాబోతున్నాయి. అసలు ఎప్పటి నుంచో టీడీపీ ఇలా జరుగుతుందని అనుమానిస్తూనే ఉంది. కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ కనుసన్నల్లోనే జగన్ -పవన్ పనిచేస్తున్నారని, వ్యూహాత్మకంగా రాజకీయాలు నడిపిస్తూ… ఎన్నికల సమయానికి తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేలా ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని టీడీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తూనే ఉంది.

తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైకాపాతో కలిసేందుకు సుముఖంగా ఉన్నారని తిరుపతి తాజా మాజీ ఎంపీ వరప్రసాద్ బయటపెట్టారు. ఆయన రాజీనామా ఆమోదించడంతో తొలిసారిగా తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్న అవినీతి నచ్చకపోవడంతో పవన్ 2019లో జగన్ తో కలిసి నడవడానికి సిద్ధపడ్డారని తెలిపారు.జగన్ చాలా కష్టపడుతున్నాడని.. ఆయన చాలా కష్టజీవి అని పవన్ నాతో అన్నారని వరప్రసాద్ చెప్పుకొచ్చారు. ఏపీ ని అభివృద్ధి చేయడంకన్నా అవినీతి చేయడంలో చంద్రబాబు ముందు ఉన్నారని వరప్రసాద్ ఆరోపించారు. గతంకంటే ఇప్పుడు స్పీడ్ పెంచిన జనసేనని నేరుగా టీడీపీపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.

వైసీపీ- జనసేన రెండు పార్టీలు కలిస్తే ఏం జరుగుతుందో అనే టెన్షన్ ఇప్పుడు టీడీపీలో కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలు ఒక్కటైతే ప్రభుత్వ వ్యతిరేకతా .. సామజిక వర్గాల మద్దతు కలగలిపి విజయం దక్కుతుందనే ఆలోచనలో ఈ రెండు పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబు ని రాజకీయంగా దెబ్బకొట్టాలంటే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటేనే మంచిదని బీజేపీ వ్యూహం పన్నుతోంది. అయితే ఈ రెండు పార్టీల మధ్యనా సీట్ల పంపకం ఎలా ఉండబోతోందో చూడాలి. అయినా దీనిపై ఇరు పార్టీల నేతలు ఇప్పటివరకు నోరు మెదపలేదు. అలాగే జనసేన -వైసీపీ లు ఒకరిని ఒకరు విమర్శించుకున్న దాఖలాలు కూడా ఈ మధ్య కనిపించలేదు.