బీజేపీ ని ముంచుతున్న యూపీ సీఎం !       2018-06-04   02:03:10  IST  Bhanu C

మరో నరేంద్రమోదీగా పేరు పొందిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ పై క్రమక్రమంగా నీలినీడలు అలుముకుంటున్నాయి. మొదట్లో ఆయన నిర్ణయాలు, పరిపాలన చూసి దేశవ్యాప్తంగా ఆయనకు జై జై లు పలికారు ప్రజలు. అయితే క్రమక్రంగా ఆయన తన ప్రాభల్యం కోల్పోయి తన అసమర్ధతను బయటపెట్టుకుంటున్నాడు. దీంతో.. మిత్రపక్షాలే కాదు.. సొంత పార్టీలోనూ అసంతృప్తి వెల్లువెత్తుతోంది.. ఇటీవల ముగ్గురు ఎంపీలు సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు. తాజాగా శని – ఆదివారాల్లో బీజేపీ మిత్రపక్షానికి చెందిన రాష్ట్ర మంత్రి – ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఘాటు విమర్శలు చేశారు. ఆందోళనలో పాల్గొనడంతో బీజేపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ పరిపాలన నచ్చకే యూపీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. బీజేపీకి దాదాపు 70కు పైగా సీట్లు అందించి కేంద్రంలో అధికారం కట్టబెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అఖిలేష్ యాదవ్ ను దించేసి యోగి ఆధిత్యనాత్ ను గద్దెనెక్కించారు. అయితే మోడీ ఎంతో నమ్మి అప్పగించిన పీఠాన్ని ఆయన సక్రమంగా నిర్వహించలేకపోతున్నారనే మాటలు ఇప్పుడు ఎక్కువయ్యాయి.

యూపీ మంత్రి సుహేల్ దేవ్ – భారతీయ సమాజ్ పార్టీ (ఎస్ బీఎస్ పీ) అధినేత ఓ ప్రకాష్ రాజ్ భార్ .. యోగిని సీఎంగా నియమించిన విధానంపై మండిపడ్డారు. ‘యూపీ ప్రజలు బీజేపీకి అఖండ మెజార్టీని కట్టబెట్టారు. అందుకు కారణం ఎన్నికల వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ముందుండి పార్టీని నడిపించడమే.. ఆయన సీఎం అవుతారని ప్రజలు భావించారు. కానీ ఫలితాల తర్వాత బీజేపీ అధిష్టానం అనూహ్యంగా యోగికి పట్టం కట్టింది. ప్రజలు ఆశించింది ఒకటైతే.. అధిష్టానం మరోటి చేసింది. అందుకే యోగీ నేతృత్వంలో ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతోంది.’ అని విమర్శించారు. అంతేకాదు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతోందని ఆరోపించారు.
తన నియోజకవర్గంలోని బెల్తెరా స్టేషన్‌లో రైళ్లను ఆపాలంటూ సలేంపూర్‌ ఎమ్మెల్యే రవీంద్ర కుశ్వాహా డిమాండ్‌ చేస్తున్నారు. తాను రైల్వే మంత్రి పీయుష్‌ గోయల్‌కు ఎన్నో లేఖలు రాసినా.. ఫలితం లేదన్నారు. బైరియా ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ స్థానిక తహసీల్‌ కార్యాలయం అవినీతితో నిండిపోయిందని, ఈ నెల 5న అక్కడ ధర్నా చేస్తానని ప్రకటించారు. హర్దోయ్‌ ఎమ్మెల్యే శ్యాంప్రకాశ్‌ కూడా యోగి పాలనను విమర్శించారు. ఇలా సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు చెలరేగుతుండడంతో బీజేపీ కూడా ఇరకాటంలో పడిపోతోంది.