ఆరని బెజవాడ మంటలు ! వంగవీటికి వైసీపీ 'ఓదార్పు'     2018-10-11   10:45:55  IST  Sai M

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బెజవాడ రాజకీయాలు కలవరం పెట్టిస్తున్నాయి. కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి రాధాకృష్ణ కు విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వైసీపీ మొండిచేయి చూపడంతో ఆయన రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే..’రాధా’ వర్గీయుల ఆందోళనను అధినేత జగన్‌ పెద్దగా పట్టించుకోలేదు. తాను చెప్పినట్లు మచిలీపట్నం పార్లమెంట్‌కు పోటీ చేయాలని లేదంటే ఎక్కడా టిక్కెట్‌ ఇచ్చేది లేదని కుంబద్దలుకొట్టినట్టు చెప్పేసాడు. ఆ పరిణామాలను అప్పట్లో తేలిగ్గా తీసుకున్న వైసీపీ ఇప్పుడు అది కుల రంగు పులుముకోవడంతో అలెర్ట్ అయ్యింది. ఇప్పుడు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక రాధా అభిప్రాయానికి వస్తే… మచిలీపట్నంలో పోటీ చేస్తే ఓటమి ఖాయమని..అక్కడ తనకు అంతగా పట్టుదలేదని, పైగా లోక్‌సభ పోటీ చేయాలంటే సొమ్ములు చాలా కావాలని ఇక అక్కడి నుంచి పోటీ చేయడం కంటే పార్టీ మారితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఇప్పటివరకు ఉన్నాడు. దీనికి ఆయన అనుచరులు కూడా మద్దతు ఇచ్చారు. అయితే..ఏ పార్టీలోకి మారాలనే దానిపై క్లారిటీకి రాలేకపోయారు.టీడీపీలోకి వెళితే…వంగవీటి కోరినట్లు ‘సెంట్రల్‌’ సీటు ఇస్తారనే హామీ ఉన్నా..ఆయన అనుచరుల్లో ఎక్కువ మంది…టిడిపిలోకి వెళ్లడానికి ఇష్టపడలేదని తెలిసింది.ఇక జనసేనలోకి వెళదామని భావించినా పవన్‌ ఏం చేస్తారో తెలియదని..ఆయన రాజకీయాలు అంత సీరియస్‌గా లేవని ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీలోకి వెళ్లి చేసేదేముందన్న అభిప్రాయం రాధాలో ఉండడంతో ఎటూ వెళ్లలేక సైలెంట్ గా ఉండిపోయాడు.

ఈ పరిణామాలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ ప్లాన్ చేసింది. కులాల లెక్కన చూసినా ఆ సామాజికవర్గం వారు వైసీపీ పై గుర్రుగా ఉన్నారని ఈ నేపథ్యంలో వంగవీటిని బుజ్జగించడమే మంచిది అనే ఆలోచనకు ఆ పార్టీ వచ్చేసింది. అంతే కాకుండా.. మచిలీపట్నం పార్లమెంట్ బరిలో నిలిచేందుకు ఎవరూ సాహసించకపోవడంతో రాధాకృష్ణను బుజ్జగించి లైన్లో పెట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని విజయవాడ పంపించారని తెలుస్తోంది. ఆయన ‘రాధా’తో సమావేశమయ్యారని… మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తే..గెలుస్తావని, ఆర్థిక విషయాలు జగన్‌ చూసుకుంటారని హామీ ఇచ్చారని, దీంతో.. రాధ మెత్తపడ్డారని ప్రచారం జరుగుతోంది.