ఆ హీరోలను నమ్మి సంతకం చేస్తే సినిమా భవిష్యత్తు కోల్పోయిన కాస్ట్యూమ్ కృష్ణ
మనిషిని మోసం చేసేవాళ్ళు ఏ ఫీల్డ్ లో అయినా ఉంటారు.సినిమా రంగంలో అయితే మరీ ఘోరంగా మోసం చేసే వాళ్ళు ఉంటారు.
ఈ ఘరానా మోసగాళ్ళ చేతుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి పెద్ద పెద్ద వాళ్ళే మోసపోయారంటే అర్ధం చేసుకోవచ్చు.ఇండస్ట్రీలో మోసం ఎంత దారుణంగా జరుగుతుందో అనేది.
అయితే ప్రముఖ సీనియర్ నటుడు అయిన కాస్ట్యూమ్స్ కృష్ణ విషయంలో కూడా ఇదే జరిగింది.ఈయన 1954 లో మద్రాస్ వెళ్ళి, అక్కడ సినిమా వాళ్ళ దగ్గర అసిస్టెంట్ కాస్ట్యూమర్ గా జాయిన్ అయ్యారు.
అతి తక్కువ కాలంలోనే గొప్ప పేరు తెచ్చుకున్న ఈయన, ఆ తర్వాత రామానాయుడు సంస్థలో ఫుల్ టైమ్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.ఎన్నో సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి వంటి హీరోల నుంచి వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి హీరోయిన్స్ వరకూ చాలా మందికి కాస్ట్యూమ్స్ అందించారు.
నాటి ట్రెండ్ కి తగ్గట్టు హీరోలకి బెల్ బాటం నుంచి బ్యాగీ ప్యాంట్టు వరకూ చాలా రకాల మోడల్ దుస్తులను హీరోలకి అందించేవారు.అప్పట్లో అవి ఒక ట్రెండ్ సెట్ చేశాయి.
చాలా ఏళ్ళు ఆ ట్రెండ్ కొనసాగుతూ వచ్చింది.
ఇక ఈయన ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ పనిచేస్తూ ఉండేవారు.ఎప్పుడూ ఖాళీ లేనంత, కనీసం కుటుంబంతో గడిపేంత సమయం కూడా లేనంత బిజీగా ఉండేవారు.ఈ కష్టానికి తగ్గ ఫలితం కూడా దక్కేది.
అయితే కాస్ట్యూమ్ డిజైనర్ గా బిజీగా ఉన్న కృష్ణలో, దర్శకుడు కోడిరామకృష్ణ నటుడ్ని చూశారు. ఆయన ఆకారం, బాడీలాంగ్వేజ్ చూసి ఇతనిలో ఏదో ప్రత్యేకత ఉందని, గొప్ప నటుడయ్యే అవకాశాలు ఉన్నాయని కోడిరామకృష్ణ, కాస్ట్యూమ్స్ కృష్ణని సినిమాల్లో నటించమని అడిగారట.
దానికి కాస్ట్యూమ్స్ కృష్ణ, “లేదండి, నాకు నటించాలన్న ఆసక్తి లేదు.అయినా నటించడానికి నాకు టైమ్ ఎక్కడుంది? కాస్ట్యూమ్ డిజైనర్ గా ఫుల్ బిజీగా ఉన్నాను” అని అన్నారు.కోడిరామకృష్ణ మాత్రం పట్టువదల్లేదు.దీంతో ఎలాగూ నిర్మాత అవ్వాలనుకుంటున్న కాస్ట్యూమ్ కృష్ణ, సినిమాల కోసం డబ్బు సంపాదించుకుందామని, ఇంట్లో భార్యాపిల్లల ప్రోత్సాహంతో నటుడిగా చేసేందుకు అంగీకరించారు.అలా భారత్ బంద్ సినిమాలో విలన్ గా నటించారు.
మొదటి చిత్రంతోనే నటుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నారు.నటుడిగా సక్సెస్ అయిన కాస్ట్యూమ్స్ కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ హీరోగా అశ్వద్దామ సినిమాని నిర్మించారు.అది హిట్ అవ్వడంతో కోడి రామకృష్ణ డైరెక్టర్ గా పెళ్ళాం చెపితే వినాలి, మా ఊరు మారదు, పుట్టింటికి రా చెల్లి, పెళ్లి పందిరి వంటి బ్లాక్ బస్టర్స్ ని తీశారు.
దీంతో కాస్ట్యూమ్స్ కృష్ణ నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు.అంతా బాగుందనుకున్న సమయంలో పెళ్లిపందిరి సినిమా రూపంలో కాస్ట్యూమ్స్ కృష్ణకి దెబ్బ తగిలింది.పెళ్లిపందిరి సినిమాలో జగపతిబాబు హీరోగా నటించారు.ఈ సినిమాకి పబ్లిసిటీ అవసరం లేదని, మౌత్ పబ్లిసిటీ ద్వారా సినిమా హిట్ అవుతుందని కాస్ట్యూమ్స్ కృష్ణ అభిప్రాయపడ్డారు.
కానీ సినిమాని కొన్న బయ్యర్లు మాత్రం భయపడ్డారు.జగపతిబాబుకి విషయం చెప్పగానే, ఆయన కాస్ట్యూమ్స్ కృష్ణని పిలిచి నా రెమ్యూనరేషన్ 5 లక్షలు తగ్గించాను కదా, రెండు లక్షలు పబ్లిసిటీ కోసం ఖర్చుపెట్టండి అని అన్నారు.
కానీ కాస్ట్యూమ్స్ కృష్ణ పబ్లిసిటీ అవసరం లేదు సార్ అని అన్నారు.దీంతో ఆ రెండు లక్షలు మేము అప్పుగా ఇస్తాము, మీరు ఒక సంతకం పెట్టండి అని ముందుకు వచ్చారు.
ఈయన పెద్దగా చదువుకోలేదు, తెలుగు, తమిళ్ తప్ప వేరే భాషలు రావు.జగపతిబాబు మీద నమ్మకంతో సంతకం పెట్టేశారు.ఆయన సంతకం పెట్టిన కాగితాల్లో ఒక కాగితంలో “కాస్ట్యూమ్స్ కృష్ణకి బయ్యర్లు రెండు లక్షలు అప్పు ఇచ్చినట్టు” ఉండగా, మరో కాగితంలో “కాస్ట్యూమ్స్ కృష్ణ దగ్గర నుంచి పెళ్లిపందిరి సినిమాకి సంబంధించిన నెగిటివ్ రైట్స్ బయ్యర్లు కొన్నట్లు” ఉంది.ఇలా కేవలం రెండు లక్షలకి తాను నిర్మించిన సినిమాని తనకు తెలియకుండానే బయ్యర్లకి అమ్మేసినట్టు సంతకం పెట్టారు.
అలా ఆయన్ని మోసం చేశారు.దీంతో ఆయనకి సినిమాల మీద విరక్తి కలిగి దూరంగా వెళ్ళిపోయారు.
ఒకప్పుడు రాజులా బతికిన కాస్ట్యూమ్స్ కృష్ణ కొంతమంది చేసిన మోసం కారణంగా చెన్నైలో ఓ అపార్ట్ మెంట్ లో సాధారణ జీవితం గడుపుతున్నారు.