మంగళగిరే ఎందుకు చినబాబు  

  • తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వారసుడు నారా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడంపై ఇప్పటి వరకు అనేక ట్విస్ట్ లు నడిచాయి. లోకేష్ తన సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా నుంచి పోటీకి దిగుతారనై ప్రచారం నడిచింది. ఆ తరువాత రాజధాని జిల్లా , కృష్ణ జిల్లాలో ఏదో ఒక బలమైన నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే టాక్ నడిచింది. తాజాగా విశాఖ జిల్లా భీమిలి నుంచి పోటీ చేయడం ఖాయం అనుకుంటున్న సమయంలో ఇప్పుడు గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బరిలోకి దిగుతున్నట్టు ప్రకటన రావడం చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్‌ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. అందుకు సరైన నియోజకవర్గం కోసం ఇప్పటివరకు వెతుకులాట ప్రారంభించారు.

  • అనేక లెక్కలు, సర్వేల అనంతరం లోకేష్‌ను మంగళగిరి నుంచి బరిలోకి దించాలని చంద్రబాబు నిర్ణయించారు. అసలు లోకేష్ మంగళగిరి ప్రాంతాన్ని ఎంచుకోవడం వెనుక కారణాలు ఏంటి అనేది ఆరా తీస్తే రాజధాని ప్రాంతంగా మంగళగిరి అభివృద్ధి చెందడంతో పాటు మున్ముందు సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే లోకేశ్‌‌ మంగళగిరి నుంచి బరిలో దిగితేనే బాగుంటుందని బాబు భావించినట్టు తెలుస్తోంది. మంగళగిరిని ఎంచుకున్న నారా లోకేష్‌ స్థానిక నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లేందుకు అన్నిరకాలుగా సిద్ధం అయిపోయాడు.

  • Why Nara Lokesh Constant From Mangalagiri Constituency-Id Development Mangalagiri Constituency Nara Ysrcp

    Why Nara Lokesh Constant From Mangalagiri Constituency

  • అమరావతి పరిధిలో ఉన్న మంగళగిరి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వల్ప ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాకపోతే ఈసారి ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇక్కడి నుంచి లోకేశ్ ను బరిలోకి దింపినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓటమిపాలైన గంజి చిరంజీవి కూడా ఈసారి టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఆయన అభ్యర్థిత్వం పై స్థానిక టీడీపీ శ్రేణులు అంత సుముఖంగా లేవని పార్టీలో చర్చ జరుగుతోంది. మంగళగిరి కేంద్రంగా ఐటీ పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు లోకేశ్ ఎంతగానో కృషి చేస్తున్నారు. అనేక ప్రభుత్వ కార్యాలయాలు, ఐటీ పరిశ్రమలు మంగళగిరికి రావడంలో లోకేశ్ పాత్ర కీలకమనే చెప్పాలి. మరోవైపు వైసీపీ తరపున మరోసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉండటం కూడా లోకేశ్‌కు కలిసొచ్చే అంశమని టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఆళ్లకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని టీడీపీ సర్వేలో తేలిందని అందుకే ఇక్కడి నుంచి పోటీ చేయించడమే కరెక్ట్ అని చంద్రబాబు డిసైడ్ అయ్యాడట.