ఇప్పుడు వర్మను తన్నేది ఎవరు?       2018-06-01   23:08:10  IST  Raghu V

వివాదాలకు పెట్టింది పేరైన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా నాగార్జునతో ‘ఆఫీసర్‌’ చిత్రాన్ని తెరకెక్కించాడు. గత దశాబ్ద కాలంగా సక్సెస్‌ లేక పోవడంతో కొట్టుమిట్టాడుతున్న వర్మకు ఈ చిత్రం సక్సెస్‌ ఇస్తుందని అంతా భావించారు. ఆయన కూడా ఈ సినిమాతో తాను మళ్లీ మునుపటి వర్మను అవుతాను అంటూ భావించాడు. కాని ఫలితం తారు మారు అయ్యింది. నిన్న విడుదలైన ఆఫీసర్‌ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. వర్మ గతంలో తీసిన సినిమాల కాలిగోటికి కూడా సరిపోలేదు. ఈ చిత్రంను నాగార్జున ఎలా అంగీకరించాడు అంటూ విశ్లేషకులు మరియు అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునను వర్మ పూర్తిగా మోసం చేశాడు అంటూ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

కథ చెబుతున్న సమయంలో నాగార్జునతో వర్మ తప్పకుండా ఈ చిత్రం సక్సెస్‌ అవుతుంది. తాను పూర్తి దృష్టి పెట్టి ఈ సినిమాను తీస్తాను. ఈ సినిమాలో ఎలాంటి కాంట్రవర్సీలు తీసుకు రాకుండా, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా చిత్రీకరిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇప్పుడు నేను చెబుతున్న స్క్రిప్ట్‌లో ఉన్నట్లుగా సినిమా తీయలేదని మీరు అనుకుంటే ఆ సమయంలోనే నన్ను కాలితో తన్నినా కూడా పడతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ప్రీ రిలీజ్‌ వేడుకలో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత అవును నిజంగానే అలా అన్నాను. ఎందుకంటే సినిమాపై నాకు అంత నమ్మకం ఉంది అంటూ వర్మ చెప్పుకొచ్చాడు.

సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ వర్మను తన్నాల్సిన అవసరం రాలేదు. అద్బుతంగా సినిమాను చిత్రీకరించాడు. ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈయన స్క్రిప్ట్‌ వర్క్‌ ఉంది. అన్ని విధాలుగా సినిమాను ఆయన ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. దాంతో సినిమా తప్పకుండా బాగుంటుందేమో అని అంతా భావించారు. ప్రీ రిలీజ్‌ వేడుక అయిన రెండు రోజుల్లోనే సినిమా విడుదలైంది. ఆ మాటలు ఇంకా మర్చి పోకుండానే సినిమా విడుదల అవ్వడంతో ఇప్పుడు అంతా కూడా వర్మను తన్నాలి.. తన్నాలి అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

వర్మను నాగార్జున తన్నేందుకు ఇష్టం లేకపోతే అక్కినేని ఫ్యాన్స్‌ అయినా తన్నాలి అంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నాడు. వారి అభిమాన హీరోను అంతగా మోసం చేసినందుకు అక్కినేని ఫ్యాన్స్‌ వర్మను విడిచి పెట్టవద్దంటూ కొందరు సోషల్‌ మీడియాలో చేస్తున్న ట్వీట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. వర్మ తాను అనుకున్న విధంగా చేయలేదు కనుక, సినిమా ఫ్లాప్‌ అయ్యింది కనుక ఖచ్చితంగా తన్నినా పడతాడు అంటూ కొందరు ట్వీట్‌ చేస్తున్నారు. మరి ఈ తన్నుడు విషయంలో వర్మ ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి.