జగన్ పై దాడి ! ఆ కత్తి ఎలా వచ్చింది ..? నిందితుడు ఎవరు..? అసలు ఉద్దేశం ఏంటి..?   Who Did Murder Attempt On YS Jagan     2018-10-25   15:16:16  IST  Sai M

విశాఖపట్నం విమానాశ్రయంలో వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై కత్తితో దాడి కలకలం రేపుతోంది. ఎయిర్ పోర్టులోకి కత్తి ఎలా వచ్చింది…దాడికి పాల్పడిన శ్రీనివాసరావు ఎవరు అన్న అంశాలపై విశాఖ పోలీసులు దృష్టి సారించారు. దాడికి పాల్పడిన శ్రీనివాసరావు ఎయిర్ పోర్ట్ లోని ఓ రెస్టారెంట్ లో చెఫ్ గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం నుంచి ఎయిర్ పోర్ట్ అవుట్ లెట్ లో ఈ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. అందులో శ్రీనివాసరావు చెఫ్ గా పనిచేస్తున్నాడు. నెలరోజుల క్రితమే శ్రీనివాసరావు చెఫ్ గా చేరాడు.

శ్రీనివాసరావు పూర్తి పేరు జనిపల్లి శ్రీనివాసరావుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిది తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక శివారు పెదపేటగా పోలీసులు తెలిపారు. అయితే కోడిపందాలు నిర్వహించే కత్తి ఎందుకు వచ్చింది…ఎందుకు దాడి చేశాడు…అంత సెక్యూరిటీని తప్పించుకుని ఎలా వెళ్లాడు అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

జగన్ పై దాడి చెయ్యాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు రెస్టారెంట్ నిర్వాహకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రెస్టారెంట్ లో లభించే పదార్థాలు చాకు ఎందుకు వచ్చింది హోటల్ లో అటువంటివి వినియోగిస్తారా లేదా అన్న కోణంలో విచారిస్తున్నారు.

అయితే అటువంటి కత్తులు రెస్టారెంట్ లో వినియోగించని నేపథ్యంలో మరి శ్రీనివాసరావు ఎలా తీసుకువచ్చాడు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే భారీ సెక్యూరిటీల కళ్లుగప్పి శ్రీనివాసరావు కత్తిని ఎలా తీసుకెళ్లాడు అన్న దానిపై సందేహంగా మారింది. జగన్ శుక్రవారం వస్తారని ముందుగానే ఊహించి శ్రీనివాస్ పథకం ప్రకారం కత్తి తీసుకువచ్చాడా అన్న సందేహం కూడా నెలకొంది

గవర్నర్ ఆరా … ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు ఫోన్‌ చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను గవర్నర్‌ నరసింహన్‌ డీజీపీని అడిగి తెలుసుకున్నారు.

ఆందోళన కార్యక్రమాల్లో వైఎసార్సీపీ …

Who Did Murder Attempt On YS Jagan-

వైఎస్‌ జగన్‌కి ఏం జరిగినా ఊరుకోబోమని రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబును తీవ్రంగా హెచ్చరిస్తున్నామన్నారు. దాడి చేసిన వ్యక్తి వెనక ఎవరున్నారో విచారణ చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలన్నారు. లేకపోతే చాలా తీవ్ర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. భుజంపైన గాయం అయిన తీరు చూస్తుంటే గోంతు లక్ష్యంగానే ఈ దాడి జరిగిందని అర్థం అవుతోందన్నారు. ప్రతిపక్షనాయకుడికే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ వైసీపీ నాయకులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

ఎయిర్ పోర్టులో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం జగన్ ను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. జగన్ పై దాడి దృశ్యాలు టీవీలో చూసి ఆయన అభిమానులు చలించిపోయారు. వేలసంఖ్యలో జగన్ అభిమానులు, కార్యకర్తలు.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని టీడీపీ అధినేత చంద్రబాబు కు వ్యతిరేకంగా … జగన్ కి అనుకూల నినాదాలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ దాడి పరిణామాలు ఏపీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా టీడీపీ మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది.