శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామికి, శనీశ్వరుని ఎంతో ప్రీతికరమైన రోజు.శనీశ్వరుడు శనివారానికి అధిపతి.
అలాగే శనివారం శనీశ్వరుడిని పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి.కానీ కొంతమంది ఈ శనీశ్వరుని పూజించడం వల్ల శని మన వెంట వస్తుందని భావిస్తుంటారు.
కానీ అది కేవలం వారి అపోహ మాత్రమే.శనీశ్వరుడు వారి భక్తుల పట్ల దయ హృదయంతో కలిగి ఉంటాడు.
శనీశ్వరుడిని భక్తిభావంతో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని, ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.
శనివారం ఉదయం నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసి చిన్నపాటి వస్త్రములో కొద్దిగా నువ్వులు మూట కట్టి వాటిని శనీశ్వరునికి సమర్పించి, నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
దీపారాధన చేసిన అనంతరం నువ్వులను అన్నంలో కలిపి కాకులకు పెట్టి ఆపై మనం భోజనం చేయాలి.ఈ విధంగా చేయుట ద్వారా ఏలినాటి శని, జన్మశని, అర్ధాష్టమ శని తొలగిపోయి, శనీశ్వరుని అనుగ్రహం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
అలాగే శనిభగవానుడి శాంతి కోసం హోమాలు నిర్వహించడం,నువ్వులను యాలకులును బాగా దంచి, ఆ పొడితో చూర్ణం తయారు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి, శనీశ్వరునికి నైవేద్యంగా సమర్పించి పేదలకు దానాలు చేస్తారు.ఇలా కాకులకు నువ్వులు కలిపిన అన్నాన్ని పెట్టి, పేదలకు వస్త్ర దానం చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం మనమీద కలిగి ఏళ్ల తరబడి ఉన్న శని తొలిగిపోవడమే కాకుండా, సిరి సంపదలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
శనీశ్వరుని అనుగ్రహం కోసం పూజించేవారు శనివారం ఉదయం శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలలో శనీశ్వరుని విగ్రహం చుట్టూ నువ్వుల నూనెతో దీపారాధన చేసి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షణలు చేయడం ద్వారా స్వామివారి అనుగ్రహం కలిగి మన మీద ఉన్నటువంటి శని ప్రభావం తొలగిపోతుంది.