‘మహానటి’ తర్వాత తెలుగులో కీర్తి పరిస్థితి ఏంటీ?       2018-05-21   22:00:46  IST  Raghu V

తమిళంలో హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న కీర్తి సురేష్‌ తెలుగులో ‘నేను శైలజ’ చిత్రంతో పరిచయం అయ్యింది. అమ్మ, అమ్మమ్మ ఇద్దరు కూడా సినిమాల్లో రాణించిన వారే అవ్వడంతో వారి వారసత్వంగా కీర్తి సురేష్‌ తెలుగు మరియు తమిళంలో అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు పొందిన కీర్తి సురేష్‌ ఆ తర్వాత వరుసగా తెలుగులో ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకు వెళ్తుంది. పవన్‌ కళ్యాణ్‌ సరసన అజ్ఞాతవాసి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో కీర్తి సురేష్‌కు కాస్త నిరాశ.

అంతలోనే ఈమె నటించిన ‘మహానటి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుష్కకు అరుంధతికి ముందు, ఆ తర్వాత కెరీర్‌ ఎలా విభజించవచ్చో, కీర్తి సురేష్‌కు కూడా మహానటికి ముందు, ఆ తర్వాత అన్నట్లుగా విడదీయవచ్చు. అయితే అరుంధతి చిత్రం తర్వాత అనుష్కకు భారీ ఎత్తున క్రేజ్‌ దక్కింది. వరుసగా ఆమెకు సినిమాల్లో ఛాన్స్‌లు వచ్చాయి. కాని ఇక్కడ కీర్తి సురేష్‌కు తెలుగులో ఇప్పట్లో కమర్షియల్‌ పాత్రల్లో నటించే ఛాన్స్‌ రాకపోవచ్చు అనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. ‘మహానటి’ చిత్రంలో సావిత్రిగా నటించిన ఆమెను అంతా కూడా సావిత్రి అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఇప్పట్లో ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు మహానటి మైకం నుండి బయట పడే పరిస్థితి లేదు. అందుకే కీర్తి సురేష్‌కు ఇప్పట్లో కమర్షియల పాత్రలు అంటే హీరోలతో డ్యూయెట్లు, రొమాన్స్‌ చేసే పాత్రలు దక్కక పోవచ్చు అంటున్నారు. మహానటిగా నటించిన కీర్తి సురేష్‌ ఇలాంటి కమర్షియల్‌ పాత్రలు చేసిందేంటి అంటూ ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తారనే ఉద్దేశ్యంతో కీర్తి సురేష్‌ను ప్రస్తుతం యువ హీరోలు, స్టార్‌ హీరోలు పక్కకు పెడుతున్నారు. కనీసం ఆరు నెలల నుండి సంవత్సరం వరకు అయినా కీర్తి సురేష్‌కు కమర్షియల్‌ సినిమాల్లో ఛాన్స్‌ రాకపోవచ్చు అనే టాక్‌ వినిపిస్తుంది.

తెలుగులో ప్రస్తుతానికి కీర్తి సురేష్‌ ఒక్క సినిమా కూడా చేయడం లేదు. అయితే తమిళనాట ‘మహానటి’ క్రేజ్‌ వల్ల మూడు నాలుగు సినిమాల్లో ఛాన్స్‌లు వచ్చాయి. తెలుగులో అవకాశాల కోసం ఈమె ప్రయత్నాలు చేస్తున్నా కూడా దక్కడం లేదంటూ సమాచారం అందుతుంది. మొత్తానికి కీర్తి సురేష్‌కు ‘మహానటి’ ఒక గొప్ప కీర్తిని తీసుకు వచ్చింది. అయితే ఆ కీర్తి ఆమె కమర్షియల్‌ సినిమాలపై ప్రభావం ఖచ్చితంగా చూపుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. త్వరలోనే కమర్షియల్‌ సినిమాలతో కీర్తి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి. కొంత కాలం వరకు కీర్తి సురేష్‌ను చూడగానే మహానటి గుర్తుకు రావడం ఖాయం. అందుకే కొన్నాళ్లు తెలుగు ప్రేక్షకులకు కీర్తి సురేష్‌ దూరంగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.