ముందస్తుపై మరింత ముందుకు ! పార్టీలతో లా కమిషన్ చర్చలు       2018-07-03   01:20:51  IST  Bhanu C

కొంతకాలంగా ఊరిస్తూ .. ఉబ్బిస్తూ వస్తున్న ముందస్తు ఎన్నికలపై కేంద్రం ముందడుగులే వేస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంతో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ‘జమిలి’ ఎన్నికల పేరుతో కొంతకాలంగా కేంద్రం హడావుడి చేస్తోంది. పార్టీలు కూడా ఇందుకు తగ్గట్టుగానే వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ వస్తున్నాయి. రాజస్థాన్ తోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి కూడా ముగిబోతుండడం వల్ల జమిలి ఎన్నికలు నిర్వహిస్తేనే బెటర్ అన్న ఆలోచనలో కేంద్రం ఉంది.

దీనిలో భాగంగానే జమిలి ఎన్నికలకు సంబంధించిన సంప్రదింపుల నిర్వహణకు లా కమిషన్ సిద్ధం కావడం. ఈ నెల 7, 8 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో లా కమిషన్ సంప్రదింపులు జరపబోతోంది. లోక్ సభతోపాటు, దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై ఆయా రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతుంది. వీటితోపాటు ప్రజల నుంచి కూడా జమిలి ఎన్నికలపై సలహాలూ సూచనలూ తీసుకునేందుకు లా కమిషన్ సిద్ధం అవుతోంది.

ఇంతవరకు బాగానే ఉన్నా.. దీనిపై అనేక అనుమానాలు కూడా మొదలయ్యాయి. అన్ని రాష్ట్రాలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కావాల్సిన సౌకర్యాలు , సిబ్బంది, అందుబాటులో ఉంటాయా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగాక కూడా.. ఏదైనా రాష్ట్రంలో ఐదేళ్లలోపే ప్రభుత్వం పడిపోయి, రాష్ట్రపతి పాలన వస్తే.. ఆ తరువాత పరిస్థితి ఏంటి అనేది తేలాల్సి ఉంది. ఇటువంటి టెక్నీకల్ పాయింట్ల మీద పార్టీలకు స్ప్రష్టత ఇవ్వాల్సి ఉంది. అంతే కాకుండా జమిలి ఎన్నికల నిర్వహణ, అనంతర పరిణామాలపై రాజ్యాంగపరమైన వెసులుబాటుపై ముందుగా చర్చ జరగాలి. ఒకవేళ ఇప్పటికిప్పుడు రాజ్యాంగ సవరణ చేయాల్సిన పరిస్థితి వస్తే. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇచ్చేవారు ఎంతమంది ఉంటారనేది తేలాల్సి ఉంది .