బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి రాజీనామా చేశారు.ఈ సందర్భంగా ఆయన బీజేపీపై, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపుతున్నాయి.
మోత్కుపల్లి ఇక గులాబీ గూటికి చేరడం ఖాయం అనే వాదనలు వినిపిస్తున్నాయి.హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టే ‘దళిత బంధు’ కంటే ముందే నిర్వహించిన దళిత సాధికారత సమావేశానికి సీఎం కేసీఆర్ నుంచి మోత్కుపల్లికి ఆహ్వానం వచ్చింది.
ఈ నేపథ్యంలో ఆ సమావేశానికి హాజరైన క్రమంలోనే ఆయన్ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.కాగా, తన అనుభవాన్ని బీజేపీ గౌరవించడం లేదనే భావనలో ఉన్నందునే మోత్కుపల్లిని దళిత సాధికారత సమావేశానికి పిలిచారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా హుజురాబాద్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే జిల్లాకు చెందిన ఇతర పార్టీల సీనియర్ నేతలను తమ గూటికి చేర్చుకుంటున్నారు గులాబీ నేతలు.
ఇప్పటికే తెలంగాణ టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డిని సీఎం స్వయంగా తన పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ క్రమంలోనే మోత్కుపల్లిని కూడా గులాబీ పార్టీలోకి ఆహ్వానిస్తారనే అంచనాలు ఉన్నాయి.

పైగా మోత్కుపల్లి ఇప్పటికే సీఎం కేసీఆర్ దళితుల పట్ల ప్రేమ చూపుతున్నారని, వారి అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్నారనే వ్యాఖ్యలు చేశారు.ఈ పరిణామాలతో పాటు మోత్కుపల్లి బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై సంచలన ఆరోపణలు చేయడం టీఆర్ఎస్ వర్గాలకు ఆనందదాయకమే కదా.ఈటల అవినీతిపరుడని, ఆయన్ను బీజేపీలోకి చేర్చుకోవడం తనకు బాధ కలిగించిందని మోత్కుపల్లి పేర్కొన్నాడు.

ఈటల చేరిక సందర్భంగా తనకు కనీసమ మాట మాత్రంగానైనా చెప్పలేదని తెలిపాడు.ఈ నేపథ్యంలోనే మోత్కుపల్లి వంటి నేత ద్వారా సామాజిక వర్గాల సమీకరణాలోనూ, సీనియారిటీలోనూ తమకు ఉపయోగపడతాడని టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.అందుకే హుజురాబాద్‌లో రకరకాల ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది.