ఆ 'పంచాయతీ' పై పవన్ ముందుకా ...? వెనక్కా..?     2018-10-24   13:02:50  IST  Sai Mallula

ఏపీలో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో అందరి దృష్టి ప్రధాన పార్టీల మీద పడింది. దీనిపై ఏ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా కొత్తగా ఎన్నికల బరిలోకి వెళ్ళబోతున్న జనసేన పార్టీ ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తుందా అనేది అందరికి ఆసక్తి కలిగిస్తోంది. గత కొంత కాలంగా టీడీపీ ప్రభుత్వం పై పవన్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. దమ్ముంటే పంచాయతీ ఎన్నికలు పెట్టాలి అంటూ నిలదీస్తున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఆ సవాల్ కి తెరపడింది. ఎలాగు ఎన్నికలు తప్పవు కనుక జనసేన ఈ ఎన్నికల బరిలో ఉంటుందా ..? ఉంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేది లెక్క తేలాల్సి ఉంది.

What Is The Decision On Panchayati Raj Election Of Janasena In AP-

What Is The Decision On Panchayati Raj Election Of Janasena In AP

జనసేన పార్టీకి ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో బలమైన క్యాడర్ లేదు. పట్టణాలు, నగరాల్లో. ఫ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించినా.. గ్రామాల్లో అసలు ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. కొద్ది రోజుల కిందట.. జనసేన పార్టీ జెండా దిమ్మలు ఊరూరా ఉండాలని.. పవన్ కల్యాణ్ అభిమానులకు పిలుపునిచ్చారు. కానీ.. ఆ పిలుపుకి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. గోదావరి జిల్లాల్లో ఆ ఊపు కొంచెం కనిపించినా.. మిగతా జిల్లాల్లో పెద్దగా స్పందన లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు మీద పడితే జనసేన ఎదుర్కోగలడా అనే సందేహం వ్యక్తం అవుతోంది.

What Is The Decision On Panchayati Raj Election Of Janasena In AP-

పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తుల మీద జరగవు. సానుభూతి పరుల ఆధారంగా.. ఆయా పార్టీల క్యాడర్లను నిలబెడతారు. వ్యవస్థ అంతా ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకత్వం మీదనే నడుస్తుంది. టీడీపీ, వైసీపీలకు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వ్యవస్థ ఉంది కాబట్టి.. వాటితో ఎన్నికలను మేనేజ్ చేసుకోగలవు. కానీ.. అలాంటి వ్యవస్థ జనసేనకు లేదు. ఇది ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామమే. అందులోనూ సాధారణ ఎన్నికల సమయం కూడా దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల ప్రభావం ఆ ఎన్నికల మీద కూడా ఉంటుంది. అంటే… ఇక్కడ ఫలితాలు అటు ఇటుగా వస్తే ఆ ఎఫెక్ట్ సాధారణ ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుంది. ఈ పరిణామాలన్నీ జనసేనను కలవరపెడుతున్నాయి. పైకి సవాల్ చేస్తున్నా.. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక తర్జనభర్జనపడుతున్నారు.