బాబు గారికి ఓ లేఖ ... సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిపోయింది.ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతుండడంతో.

 Voter Letter To Chandrbabu-TeluguStop.com

సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు.అందుకే ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ మీడియా కి కూడా పెద్ద ఆదరణ కూడా కనిపించడంలేదు.

ఎవరు ఏమి చెప్పాలనుకున్నా .ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను నిలదీయాలనుకున్నా సోషల్ మీడియా ను ఉపయోగించుకుంటున్నారు.ఒకరకంగా చెప్పాలంటే .సోషల్ మీడియా అంటే ప్రతి ఒక్కరికి ఒక ఛానెల్ ఉన్నట్టే లెక్క అన్నట్టు పరిస్థితి ఉంది.ఇంతకీ విషయం ఏంటంటే.ఒక సామాన్యుడి ప్రశ్న అంటూ చంద్రబాబు ని ప్రశ్నిస్తున్న ఓ లేఖ సోషల్ మీడియా లో గిర్రా గిర్రా తిరుగుతోంది.అది యధాతథంగా ఇలా ఉంది.

మాన్యులు, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి
సవినయంగా రాయునది ఏమనగా…

విభజన తర్వాత తీవ్రంగా దగాపడి అన్యాయం కాబడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మీరు మహానాడు పేరుతో చేస్తున్న ఆర్భాటానికి కడుపు మండి మీకు ఓటు హక్కు వేసిన హక్కుతో ఓ సామాన్య పౌరుడిగా అడుగుతున్న నా ధర్మ సందేహాలు తీర్చగలరని మనవి.

రాష్ట్రం అప్పుల్లో ఉంది అని పదే పదే జపిస్తూ సానుభూతి కోసం పరితపించే మీరు ఇన్ని కోట్ల రూపాయలతో మహానాడు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో కాస్త చెబుతారా.అంతగా కావాలి అనుకుంటే రాజధాని అమరావతిలోనో లేదా హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో పెట్టుకుంటే పోయేదానికి ఇంత హంగామా ఎందుకు?

ప్రజలు సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.నీటి కొరత, రవాణా సౌకర్యం లాంటి కనీస వసతులు లేక వందల కొద్ది గ్రామాలు నరక కూపాల్ని తలపిస్తున్నాయి.కానీ మీ మహానాడుకు ఎటువంటి ఆటంకం కలగకుండా మొత్తం ఉద్యోగ వ్యవస్థనే దీని కోసం వాడుతున్నారే.

దీన్నేమంటారో మీరే చెబుతారా?

మహానాడు ప్రాంగణంలో వెలుస్తున్న నిలువెత్తు కటౌట్లకు, వేడుక అయిపోయాక పైసాకు పనికిరాని ఫ్లెక్సీలకు ఎన్ని లక్షల రూపాయలు మీ టిడిపి నాయకులు ఖర్చు పెడుతున్నారో మీకేమైనా తెలుసా.ఆ డబ్బులో సగం విదిల్చినా చాలు ఎన్నో గ్రామాలకు మంచి నీటి సౌకర్యం కల్పించవచ్చు కాదంటారా?

అన్నట్టు ఇది సమావేశమా లేక ఎవరిదైనా ఒళ్ళు బలిసిన షావుకారు ఇంటి పెళ్లా? ఒక్క పూట భోజనానికి అన్ని రకాల రుచులు వండుతారా? తిండిపోతుల పోటీ ఏమైనా పెడుతున్నారా? నిజంగా రాష్ట్రం గురించి దిగులు ఉంటే సర్దుకుని తక్కువ బడ్జెట్ లో కడుపు నిండితే చాలు అనుకునే తిండి పెట్టాలి కానీ ఒంట్లో కొవ్వు ఉచితంగా పెరిగేందుకు నిర్వహిస్తున్న శిబిరంలా ఏంటండి ఆ మెనూ? మీకు తెలియకుండానే జరుగుతోందంటారా?

నిరుద్యోగం తాండవిస్తోంది.వలసలు పెరుగుతున్నాయి.అవినీతి ప్రభుత్వ కార్యాలయాల్లో రాజ్యమేలుతోంది.మీ నాయకులే కాంట్రాక్టుల పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు.వాటి గురించి మహానాడులో చర్చిస్తారా లేదా మీ భజనలో తరించే వారికి కొత్తగా ప్రమోషన్లు ఇచ్చే మహత్తర ప్రణాళిక ఏమైనా రచించారా?

బస్సును ఆపి మీ మంత్రి వెనుకబడిన వర్గాల విద్యార్థిని అందరి ముందు తిడతాడు.ఇంకొక మహానుభావుడు ఏకంగా మహిళా ప్రభుత్యోగిని జుట్టు పట్టుకు ఈడుస్తాడు.ఆయనే ఓ బస్సు మీద మీ ఫోటో చిరిగిపోయిందని డ్రైవర్ కండక్టర్లను రాయలేని భాషలో బూతులు తిట్టి ప్రయాణీకులకు నరకం చూపిస్తాడు.

ఇంకొకాయన ఒళ్ళు మరిచి దేవుడికి కులం అంటిస్తాడు.వీళ్ళందరీకి క్రమశిక్షణ నేర్పిస్తారా లేక ముందు ముందు ఇంకా తెగబడండి మీ వెనుక నేనున్నా అంటూ భుజం తట్టి అభయమిస్తారా? మహానాడు వేదికపై అదేదో చేసి పుణ్యం కట్టుకోండి.మీ మంత్రులు కనిపిస్తే గోచీలు తడుపుకోవడం అలవాటు చేసుకుంటాం.

హోదా విషయంలో నాలుగేళ్లు నాటకాలు ఆడి ఎన్నికలు ఏడాదిలో వస్తాయనగా ఇప్పుడు నిద్ర లేచారు.

నిజంగా చిత్తశుద్ధి ఉంటే హోదా ఎలా సాధిస్తారో ఇప్పుడైనా వివరించండి.నవ నిర్మాణ దీక్షలంటూ మీరు ఆడుతున్న డైలీ సీరియల్ వేషాలు అంతా గమనిస్తున్నారు.ఇకనైనా కాస్త నిజాయితీగా ఉండండి.నమ్మే ప్రయత్నం చేస్తాం

ఇలా రాసుకుంటూ పోతే రామాయణం కాదు చంద్రాయణం రాయాల్సి వచ్చేలా ఉంది.

మీ మీద నమ్మకంతో అధిక శాతం ప్రజలు మీకు పట్టం కట్టారు.మీరేమో నిలువునా ముంచేశారు.

ఇలా మహానాడు పేరిట మీరు చేస్తున్న ఈ ఆర్భాటపు హడావిడి చూస్తుంటే మహానటీనటుల కలయిక ఒకే దగ్గర చూస్తున్నట్టు ఉంది.ఇకనైనా కాస్త బాధ్యతగా ఉండండి.

నమ్మి నిలబెట్టాం కదా ఇంకా మోసం చేయకండి.

మీరు అందలం ఎక్కిన నిచ్చెన మెట్లు చెక్కింది మేమే.

దాన్ని కోసి మిమ్మల్ని కింద పడేసే రంపాలు కూడా మా దగ్గరే ఉన్నాయి….

తస్మాత్ జాగ్రత్

ఇట్లు
ఒక అభాగ్య ఓటరు
ఆంధ్రప్రదేశ్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube