తీవ్ర వివాదంలో టీడీపీ విధేయ ఎమ్మెల్యే.. కార‌ణం ఏంటి?   Vivadham Lo TDP MLA     2018-04-09   04:17:17  IST  Bhanu C

టీడీపీ విధేయ ఎమ్మెల్యేగా, చంద్ర‌బాబుకు అత్యంత అభిమానిగా వ్య‌వహ‌రించే గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే, వివాద ర‌హితుడు వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి నాలుగేళ్లు పూర్త‌యినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి వివాదాల జోలికీ పోని ఎమ్మెల్యే ఒక్క‌సారిగా ఇలా వివాదంలో చిక్కుకోవ‌డం స్థానికంగా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు ధ‌ర్నాల‌కు దిగ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని పెద్ద అవుటపల్లికి చెందిన గ్రామ రెవెన్యూ సహాయకులు షేక్‌ హైదర్‌సాహెబ్, మేడూరి తిరుపతయ్య, ఆయన కుమారుడు వినోదరావుకు 1974లో అప్పటి తహసీల్దార్‌ చిన్నఅవుటపల్లి గ్రామ పరిధిలో 1.10 ఎకరాల చొప్పున రెండు ఎకరాల ఇరవై సెంట్లు ప్రభుత్వ భూమిని కేటాయించారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల వారసులు ఆ భూమికి శిస్తు కట్టుకుంటూ సాగు చేసుకుంటున్నారు.


ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం వీరి భూములను కూడా ప్రభుత్వం సేకరించింది. అయితే ఎటువంటి పరిహారం చెల్లించకపోవడంతో గత పది రోజులుగా సదరు భూముల్లో పనులు జరగకుండా నిర్వాసితులు అడ్డుకుంటున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఇంటికి రావాల్సిందిగా నిర్వాసితులను కాంట్రాక్టర్‌ పిలిపించారు. దీంతో అక్కడికి చేరుకున్న నిర్వాసితులు మల్లవల్లి, కొండపావులూరు, వీరపనేని గూడెంలో ప్రభుత్వ భూముల సాగుదారులకు పరిహారం చెల్లించారని మాకెందుకు ఇవ్వరని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన వంశీ నిర్వాసితుల్లో ఒకరైన షేక్‌ అబ్దుల్లాను కాలర్‌ పట్టుకుని ఈడ్చుకువెళ్లి బయటకు నెట్టేశారని అక్కడే ఉన్న వీరి బంధువులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది దాడిచేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే తీరుకు నిరసనగా నిర్వాసితులు ఆయన ఇంటి ముందే గన్నవరం–పుట్టగుంట ఆర్‌ అండ్‌ బీ రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించి స్టేషన్‌లోనే నిర్బంధించారు. రోడ్డుపై ధర్నాకు దిగినందుకు 15 మందిపై కేసులు నమోదు చేశారు. కాగా, చర్చల పేరుతో తమను ఇంటికి పిలిచి దౌర్జన్యానికి పాల్పడడంతోపాటు దుర్భాషలాడి, సిబ్బందితో కొట్టించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిర్వాసితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి సీపీఎం, సీఐటీయూ నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ ప‌రిణామంతో వంశీపై ఒక్క‌సారిగా విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి. ప్ర‌భుత్వంతో మాట్లాడి నిర్వాసితుల‌కు న్యాయం చేసే స‌త్తాలేని వంశీ ఇలా త‌న‌కు ఓట్లు వేసి గెలిపించిన వారిపై దౌర్జ‌న్యం చేయ‌డం ఏంట‌ని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.

నిజానికి గ‌తంలోనూ విమానాశ్ర‌య నిర్వాసితుల ప‌క్షాన ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు వంశీ ప్ర‌య‌త్నించినా ఎలాంటి ఫ‌లిత‌మూ క‌నిపించ‌లేదు. దీంతో ఆయ‌న ఇప్ప‌టికే ఈ విష‌యంలో నిర్లిప్త‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏదేమైనా కాంట్ర‌వ‌ర్సీల‌కు దూరంగా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లే వంశీపై ఇలాంటి ఆరోప‌ణ‌లు రావ‌డం సంచ‌ల‌న‌మే. మ‌రి దీనికి వంశీ నుంచి ఎలాంటి రిప్లే వ‌స్తుందో ? చూడాలి.