కష్టపడటం చేతకాని కొందరు కేటుగాళ్లు జనాలను ఎలా దోచుకుంటున్నారో మనం నిత్యం వార్తల్లో చూస్తున్నాం.అవకాశం దొరకలేగాని కళ్లుగప్పి చిటికెలో చోరీ చేసి మాయమైపోతూ వుంటారు.
ఇక సోషల్ మీడియా బాగా విస్తరించడంతో ఇలాంటి చోరీ ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా తరచూ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతోంది.
ఇందులో ఇద్దరు దొంగలు సినిమా రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా బైక్ దొంగతనానికి పాల్పడ్డారు.అయితే ఇంతలో గేట్ వద్ద కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ సమయస్ఫూర్తితో నడుచుకోవడంతో వారు దొరికిపోయారు.
ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకోగా తాజాగా వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే.సౌత్‌ఢిల్లీలోని ఎవరెస్ట్ అపార్ట్‌మెంట్‌లోకి మున్సిపల్ అధికారులమని చెప్పుకుంటూ ఇద్దరు వ్యక్తులు వెళ్లారు.వారి కదలికలు మొదటి నుంచి అనుమానాస్పదంగా ఉండడంతో అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ వారిపై ఓ కన్నేసి ఉంచాడు.
ఇదే సమయంలో అపార్ట్‌మెంట్‌లోపలికి బైక్‌పై ఓడెలివరీ బాయ్ వచ్చాడు.అతను తన బైక్ తాళాలను ఆ వాహనానికే ఉంచి వెళ్లాడు.
ఇది గమనించిన ఆ ఇద్దరు వ్యక్తులు బైక్‌ను చోరీ చేసేందుకు ప్రయత్నించారు.
బైక్‌ను స్టార్ట్ చేయడం ప్రారంభించగానే డెలివరీ బాయ్ గట్టిగా కేకలు వేశాడు.ఇది విన్న సెక్యూరిటీ గార్డ్ వెంటనే అలెర్ట్ అయ్యి, వేగంగా దూసుకొస్తున్న బైక్ ను అడ్డుకునేందుకు గేటు మూసివేశాడు.దీంతో ఆ బైక్ గేటు మధ్యలో ఇరుక్కుపోయింది.
ఇంతలో చుట్టుపక్కల వారు వచ్చి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు.అయితే ఇద్దరిలో ఒకరు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.
మరొకరిని పోలీసులకు పట్టించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
సెక్యూరిటీ గార్డ్ చేసిన పనిని అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.