విజేత పెట్టుబడి ఎంత వచ్చింది ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే     2018-07-17   13:27:32  IST  Ramesh Palla

మెగా ఫ్యామిలీ నుండి తాజాగా ‘విజేత’ చిత్రంతో కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా పరిచయం అయ్యాడు. చిరంజీవి చిన్నల్లుడు అయిన కళ్యాణ్‌ దేవ్‌ సినిమాలపై ఆసక్తితో హీరోగా మారాడు. సినిమాల్లో నటించేందుకు ముందు దాదాపు ఆరు నెలల పాటు నటనలో శిక్షణ కూడా తీసుకున్నాడు. చిరంజీవి ప్రోత్సాహం, మెగా అభిమానుల అండదండలు ఉన్న కారణంగా కళ్యాణ్‌ ఎంట్రీ భారీగానే జరిగింది. తప్పకుండా కళ్యాణ్‌ మంచి హీరో అవుతాడు అంటూ అంతా భావించారు. సాయి కొర్రపాటి చేతిలో కళ్యాణ్‌ను చిరంజీవి పెట్టడం జరిగింది. మంచి కథలు ఎంపిక చేసుకుంటాడు అని సాయి కొర్రపాటికి పేరు ఉంది.

కళ్యాణ్‌ కోసం ఒక కథను ట్యాలెంటెడ్‌ దర్శకుడిని సాయి కొర్రపాటి ఎంపిక చేసి ‘విజేత’ చిత్రాన్ని నిర్మించాడు. ఆయన అనుకున్నది తారు మారు అయ్యింది. మెగా హీరో కనుక మినిమం గ్యారెంటీ అని భావించాడు. కాని అనూహ్యంగా సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దాదాపు 10 కోట్ల బడ్జెట్‌తో సినిమాను నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించాడు. కొత్త హీరో అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. దాంతో చాలా ఏరియాల్లో సొంతంగా విడుదల చేయడంతో పాటు, కొన్ని ఏరియాల్లో మెగా ఫ్యామిలీ సన్నిహితులతో కలిసి విడుదల చేయడం జరిగింది. విడుదలకు ముందు సాయి కొర్రపాటి ఏమీ రాబట్టలేక పోయాడు. విడుదల తర్వాత ఖచ్చితంగా పెట్టిన పెట్టుబడితో పాటు లాభాలు వస్తాయని ఆశించాడు.

Vijetha Movie Gets Shocking Collections-

Vijetha Movie Gets Shocking Collections

అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి అన్నట్లుగా ఉంది ప్రస్తుతం సాయి కొర్రపాటి పరిస్థితి. పది కోట్లు పెట్టి సినిమాను నిర్మిస్తే ఇప్పటి వరకు కలెక్షన్స్‌ రూపంలో వచ్చింది కేవలం 1.3 కోట్లు. ఇక శాటిలైట్‌ రైట్స్‌ మరియు ప్రైమ్‌ వీడియో రైట్స్‌ ద్వారా 1.5 కోట్లు వచ్చే అవకాశం ఉందేమో. మొత్తం కలిపి కూడా నాలుగు కోట్లు వచ్చే పరిస్థితి లేదు. దాంతో నిర్మాత సాయి కొర్రపాటి దాదాపు ఆరు కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉందని సినీ వర్గాల వారు చెబుతున్నారు. మెగా మూవీకి ఇంత భారీగా నష్టపోతాను అని నిర్మాత భావించలేదు. తన నష్టాలను భర్తీ చేయాలని మెగా ఫ్యామిలీని సాయి కొర్రపాటి కోరబోతున్నాడు.

సాయి కొర్రపాటి చేసిన సాహసంకు ప్రతిఫలంగా ఇప్పటికే అల్లు అర్జున్‌తో ఒక చిత్రాన్ని నిర్మించే అవకాశం దక్కింది. త్వరలోనే రామ్‌ చరణ్‌తో కూడా ఈ నిర్మాత ఒక చిత్రాన్ని నిర్మించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి సాయి కొర్రపాటి ‘విజేత’ చిత్రం వల్ల నష్టపోయినా కూడా చరణ్‌, బన్నీల సినిమాల ద్వారా లాభాలు దక్కించుకునే అవకాశం ఉంది. మెగా ఫ్యామిలీతో డీలింగ్స్‌ ఉంటే ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయనే ఉద్దేశ్యంతోనే సాయి కొర్రపాటి రిస్క్‌ అయిన కళ్యాణ్‌ దేవ్‌తో ఈ చిత్రాన్ని నిర్మించి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.