బాబుకి రివ‌ర్స్‌.. మోత్కుపల్లి హ‌వా ఎంత‌..?       2018-06-14   22:55:11  IST  Bhanu C

గ‌త నెల రోజులుగా తెలంగాణ‌లోనూ, గ‌త రెండు రోజులుగా ఏపీలోనూ జోరుగా వినిపిస్తున్న పేరు మోత్కుప‌ల్లి న‌ర్సింహు లు! ఏపీ వ‌స్తా.. తిరుప‌తి వెళ్తా.. బాబును ఓడించాల‌ని వెంక‌న్న‌ను అడుగుతా?! అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే.. ఏపీలో ఆయ‌న కేంద్రంగా వార్త‌లు వ‌చ్చే ప‌రిస్థితిని తెచ్చాయి. ఇక‌, దీనికితోడు ఏపీకి చెందిన ఇద్ద‌రు కీల‌క రాజ‌కీయ నేత‌లు మోత్కుప‌ల్లితో భేటీ కావ‌డం కూడా సంచ‌ల‌నంగా మారిపోయింది. దీంతో ఇప్పుడు మోత్కుప‌ల్లి సెంట్రిక్‌గా వార్త‌లు వ‌స్తున్నాయి. వీటిలో ప్ర‌ధాన‌మైంది.. మోత్కుప‌ల్లికి ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల ద‌మ్ముందా? త‌న సామాజిక వ‌ర్గాన్ని ప్ర‌భావితం చేసి.. చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఆయ‌న పావులు క‌దిలించే స‌త్తా సొంత‌మా? మోత్కుప‌ల్లి పిలుపు ఇస్తే.. ఎంత మంది బాబుకు దూరంగా ఉంటారు?

ఇలాంటి ప్ర‌శ్న‌లు స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌స్తాయి. వీటిని విశ్లేషించే ముందు.. అస‌లేం జ‌రిగిందో చూద్దాం. తెలంగాణ లోని న‌ల్గొండ జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎస్సీ నాయ‌కుడు మోత్కుప‌ల్లి. దాదాపు 6 సార్లు ఆయ‌న అసెంబ్లీకి ఇక్క‌డి నుంచే ప్రాతినిధ్యం వ‌హించాడు. టీడీపీకి తీవ్ర వ్య‌తిరేక ప‌వ‌నాలు, కాంగ్రెస్‌కు అనుకూల ప‌వ‌నాలు వీచిన 2009లో కూడా మోత్కుప‌ల్లి ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించాడు. అయితే, 2014లో మాత్రం ఆయ‌న దూర‌మ య్యారు. చంద్ర‌బాబుకు అత్యంత విధేయుడిగా ఉన్న మోత్కుప‌ల్లి.. తెలంగాణ విడిపోవ‌డం, టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై బెంగ పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న మ‌న‌సులో కోరిక‌ను బ‌య‌ట పెట్టుకుని గ‌వ‌ర్న‌ర్ గిరీ కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.

అయితే, ఇది ఆశించిన విధంగా ఆయ‌న‌కు ద‌క్క‌లేదు. ఈ క్ర‌మంలోనే కేంద్రంలోని హోం శాఖ వ‌ర్గాలు మోత్కుప‌ల్లి గురించి వాక‌బు చేశాయి. ఆయన నియోజ‌క‌వ‌ర్గం స‌హా.. స‌చివాల‌యంలోనూ మోత్కుప‌ల్లి వ్య‌వ‌హార శైలిని తెలుసుకు న్నాయి. దీంతో ఇక‌, గ‌వ‌ర్న‌ర్ గిరీ.. వ‌చ్చేసిన‌ట్టేన‌ని మోత్కుప‌ల్లి భావించాడు. అయితే, అనూహ్యంగా ఆయ‌న‌కు ఈ అవ‌కాశం తెర‌మ‌రుగైంది. దీనికి చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని.. భావించిన మోత్కుప‌ల్లి అప్ప‌టి నుంచి రివ‌ర్స్ అయ్యాడు. ఇక‌, ఇప్పుడు తాజా విష‌యంలోకి వ‌స్తే.. ఏపీ సీఎం చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్న వారితో మోత్కుప‌ల్లి చేరిపోయాడు. కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం, వైసీపీ ఎంపీ, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డిలు విడివిడిగా మోత్కుప‌ల్లితో భేటీ అయ్యారు.

బాబుపై మ‌రింత‌గా వ్య‌తిరేక గ‌ళం పెంచాల‌న్న‌ది వారి సూచ‌న‌. ఈ క్ర‌మంలోనే మోత్కుప‌ల్లి.. తాను తిరుప‌తి వ‌స్తాన‌ని అన్నారు., అయితే, వాస్త‌వానికి ఆయ‌న పిలుపు ఇస్తే.. ఎంత మేర‌కు ప్ర‌యోజ‌నం ఉంటుంది? ఎంత మంది ఆయ‌న మాట‌ల‌ను విశ్వ‌సిస్తారు? వ‌ంటివి చూస్తే.. పెద‌వి విరుపే క‌నిపిస్తోంది. మోత్కుప‌ల్లికి ఒక్క త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌ప్ప బ‌య‌ట అంత‌గా ఫాలోయింగ్ లేదు. ముఖ్యంగా త‌న సామాజిక‌వ‌ర్గంలోనే ఆయ‌న‌కు వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. త‌న మాట‌ల‌ను ఎవ‌రూ విశ్వ‌సించ‌లేక‌పోవ‌డ‌మే.. త‌న‌కు ఎదురు వ‌స్తున్న అంశం. ఇక‌, ఏపీలో దాదాపు ఆయ‌న ఎవ‌రికీ తెలియ‌డు. దీంతో ఆయ‌న మాట‌ల‌ను విశ్వ‌సించే స్థాయి లేదు. మొత్తంగా మోత్కుప‌ల్లి ఎన్ని మొక్క‌లు మొక్కినా.. ఆయ‌న మాట‌లు ఎవ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.