సినిమా రంగంలో ఏండ్లకు ఏండ్లు కొనసాగడం అంటే మామూలు విషయం కాదు.ఎంతో టాలెంట్ తో పాటు కాలం కలిసి వచ్చేలా తీర్చి దిద్దు కుంటే తప్ప ఈ రంగంలో ముందుకు కొనసాగడం అంత ఈజీ కాదు.
అలా సినిమా పరిశ్రమలో ఎప్పటికప్పుడు వస్తున్న నూతన మార్పులను అవలంభిస్తూ ముందుకు సాగిన సినీ ప్రముఖుడు విజయ బాపినీడు.ఆయన అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి.
టాలీవుడ్ లో ఒకప్పుడు వెలుగు వెలిగిన దర్శకుడు.ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకుడు గా పని చేశాడు.
బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలకు కూడా ఆయన సంపాదకీయం చేశాడు.అంతేకాదు.
టాలీవుడ్ లో ఎన్నో యాక్షన్ సినిమాలను రూపొందించాడు బాపినీడు.ఆయన దర్శకత్వం వహించిన మగ మహారాజు, ఖైదీ నెం.786, మగధీరుడు అద్భుత విజయాలను అందుకున్నాయి.1936 సెప్టెంబరు 22న సీతారామ స్వామి, లీలావతి దంపతులకు జన్మించాడు బాపినీడు.ఏలూరుకు దగ్గరలో కల చాటపర్రు ఆయన స్వగ్రామం.ఏలూరులో డిగ్రీ చదివిన ఆయన కొంత కాలం వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగం చేశాడు.అనంతరం అపరాధ పరిశోధన అనే పత్రికలో పనిచేశాడు.అందులో తను రాసిన కథలు జనాలను బాగా ఆకట్టుకునేవి.
ఆ తర్వాత విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకుడిగా చేశాడు.
ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు.1982లో దర్శకుడిగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు.తన సినీ కెరీర్ లో మొత్తం 22 సినిమాలకు దర్శకత్వం వహించాడు.ఈయన ఎక్కువగా చిరంజీవి, శోభన్ బాబుతో కలిసి సినిమాలు చేశాడు.ఆయన తెరకెక్కించిన సినిమాల్లో గ్యాంగ్‌లీడర్, ఖైదీ నెం.786, బిగ్‌బాస్, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు సినిమాలు మంచి జనాదరణ దక్కించుకున్నాయి.అటు కృష్ణతో కృష్ణ గారడీ, రాజేంద్ర ప్రసాద్‌తో వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి చిత్రాలను తెరకెక్కించాడు.ఆయన చివరి సారిగగా 1998లో వచ్చిన కొడుకులు సినిమాకు దర్శకత్వం వహించాడు.
రాజా చంద్ర, దుర్గా నాగేశ్వర రావు, జి.రామమోహన రావు, మౌళి, వల్లభనేని జనార్దన్ ను దర్శకులుగా బాపినీడే పరిచయం చేశాడు.పాటల రచయిత భువనచంద్ర, మాటల రచయిత కాశీ విశ్వనాథ్ కూడా బాపినీడు ద్వారానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.