‘ఎ’ సర్టిఫికెట్‌ను కోరుకుంటున్న విజయ్‌ దేవరకొండ  

  • ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో చిన్న పాత్రను పోషించి మంచి గుర్తింపు దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక విజయ్‌కి హీరోగా మరింత క్రేజ్‌ తెచ్చి పెట్టిన చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. పూర్తి స్థాయి అడల్ట్‌ చిత్రంగా తెరకెక్కిన అర్జున్‌ రెడ్డి యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యింది. దాంతో అడల్ట్‌ కంటెంట్‌ ఉంటే ఖచ్చితంగా యూత్‌ను ఆకర్షించవచ్చు అంటూ దర్శకులు అంతా కూడా అదే దారి పడుతున్నారు. ఇక విజయ్‌ దేవరకొండ కూడా తన ప్రతి సినిమాకు కూడా అదే అడల్ట్‌ను నమ్ముకుంటున్నాడు. తాజాగా ఈయన ‘ట్యాక్సీవాలా’ మరియు ‘గీత గోవిందం’ చిత్రాల్లో నటించాడు.

  • -

  • విజయ్‌ దేవరకొండ ఈ రెండు చిత్రాల్లో మొదటగా ‘గీత గోవిదం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆగస్టు 15న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా ప్రకటన వచ్చింది. అతి త్వరలోనే సినిమాను పూర్తి చేసి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌కు పూర్తి చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే చిత్రంకు సంబంధించిన ఒక పోస్టర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ పోస్టర్‌లో తాను వర్జిన్‌ అంటూ హీరోయిన్‌తో హీరో చెబుతున్నట్లుగా ఉంది.

  • అర్జున్‌ రెడ్డి చిత్రంలో మాదిరిగానే ఈ చిత్రంలో కూడా అడల్ట్‌ కంటెంట్‌ ఉండబోతుందనిపిస్తుంది. హీరోయిన్‌ రష్మిక మరియు విజయ్‌ దేవరకొండల మద్య రొమాంటిక్‌ సీన్స్‌ చాలానే ఈ చిత్రంలో ఉన్నాయని, అలాగే ఈ చిత్రానికి చిత్ర యూనిట్‌ సభ్యులు ఎ సర్టిఫికెట్‌ను ఆశిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎ సర్టిఫికెట్‌ వచ్చినప్పుడు మాత్రమే సినిమాపై యూత్‌ ఆడియన్స్‌లో ఆసక్తి ఉంటుంది. అందుకే తన ప్రతి సినిమాను కూడా ఎ సర్టిఫికెట్‌తో చేయాలని విజయ్‌ దేవరకొండ భావిస్తున్నాడు.

  • మితిమీరిన వల్గారిటీ లేకుండా, క్యూట్‌గా, రొమాంటిక్‌గా సీన్స్‌ ఉండేలా విజయ్‌ దేవరకొండ ప్రయత్నాలు చేస్తున్నాడు. తన స్టార్‌డంను మరింతగా పెంచుకునేందుకు విజయ్‌ దేవరకొండ అనుసరిస్తున్న మార్గం సరైనది కాదని కొందరు అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం సక్రమ మార్గంలో ప్రయత్నించినా సఫలం కానిది, సక్సెస్‌ వచ్చే మార్గంలోనే వెళ్లడం ఉత్తమం అంటూ వ్యాఖ్యనిస్తున్నారు. మొత్తానికి అర్జున్‌ రెడ్డి చిత్రాలు ముందు ముందు విజయ్‌ దేవరకొండ నుండి చాలానే వస్తాయని తేలిపోయింది.