ఈసారి ఇద్దరితో అర్జున్‌ రెడ్డి రొమాన్స్‌     2018-10-12   10:02:20  IST  Ramesh P

విజయ్‌ దేవరకొండ టైం ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తోంది. ఈయన ‘గీత గోవిందం’ చిత్రంతో స్టార్‌ హీరో అయ్యాడు. ఇటీవల ‘నోటా’ వచ్చి ఫ్లాప్‌ అయినా కూడా మంచి వసూళ్లను సాధించిన విషయం తెల్సిందే. నోటాకు వచ్చిన కలెక్షన్స్‌ విజయ్‌ దేవరకొండ స్థాయిని చెప్పకనే చెబుతున్నాయి. వరుసగా చిత్రాలు చేస్తోన్న ఈ హీరో త్వరలో ‘ట్యాక్సీవాలా’ మరియు ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ఈయన క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

‘అర్జున్‌ రెడ్డి’ విడుదలైన సమయంలో విజయ్‌ దేవరకొండకు నిర్మాత కేఎస్‌ రామారావు అడ్వాన్స్‌ ఇచ్చాడు. ఆ చిత్రాన్ని ఇప్పుడు క్రాంతి మాధవ్‌ చేసేందుకు సిద్దం అయ్యాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంకు సంబంధించిన షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌ను నటింపజేయబోతున్నారు. రాశిఖన్నా మరియు ఐశ్వర్య రాజేష్‌లను ఈ చిత్రం కోసం ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతుంది. భారీ ఎత్తున అంచనాల నడుమ ఈ చిత్రం ప్రారంభం కాబోతుంది.

ఇప్పటి వరకు విజయ్‌ దేవరకొండ చేసిన పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం, నోటా, డియర్‌ కామ్రెడ్‌ చిత్రాల్లో కేవలం ఒక్క హీరోయిన్‌ మాత్రమే ఉంది. మొదటి సారి విజయ్‌ దేవరకొండ చిత్రంలో రెండవ హీరోయిన్‌ కనిపించబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ ఈ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద మరో సారి విజయాన్ని సొంతం చేసుకుంటాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

విభిన్న చిత్రాల దర్శకుడిగా క్రాంతి మాధవ్‌కు పేరు ఉంది. అందుకే ఈ చిత్రంతో తప్పకుండా విజయ్‌ దేవరకొండకు సక్సెస్‌ను దర్శకుడు ఇస్తాడనే టాక్‌ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రస్తుతం చేసిన, చేస్తున్న సినిమాలు విడుదలైన తర్వాత అంటే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఇద్దరు ముద్దుగుమ్మలతో క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ వచ్చే అవకాశం ఉంది.