ఎన్టీఆర్‌ కోసం వచ్చింది.. పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది       2018-07-03   23:35:15  IST  Raghu V

నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను వెండి తెరపైకి తీసుకు వచ్చేందుకు క్రిష్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించబోతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌కు రంగం సిద్దం అయ్యింది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న షూటింగ్‌ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో, వెబ్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లవుతుంది. నిన్న మొన్నటి వరకు బాలకృష్ణ మరియు దర్శకుడు క్రిష్‌కు మద్య కోల్డ్‌ వార్‌ జరుగుతుందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం కాదని తేలిపోయింది. తాజాగా హీరోయిన్‌ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది.

ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో ఎవరు నటిస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగా ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్‌ మూవీలో బసవతారకం పాత్రను గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లుగా విద్యాబాలన్‌ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. బసవతారకం పాత్రను మొదట కీర్తి సురేష్‌తో చేయించేందుకు క్రిష్‌ ఆసక్తిగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే సినిమాకు బాలీవుడ్‌ స్థాయిలో గుర్తింపును తీసుకు వచ్చేందుకు విద్యాబాలన్‌ను రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్‌లో మంచి పేరున్న దర్శకుడు క్రిష్‌ కోసం ఈ చిత్రంలో నటించేందుకు విద్యాబాలన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

తాజాగా విద్యాబాలన్‌ హైదరాబాద్‌కు వచ్చిందట. పది రోజుల పాటు విద్యాబాలన్‌ మరియు ఇతర ముఖ్య తారాగణంపై కొన్ని సీన్స్‌ను షూట్‌ చేసేందుకు క్రిష్‌ ప్లాన్‌ చేశాడు. ప్రస్తుతం బాలకృష్ణ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఆగస్టులో ఆయన సినిమా చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు. ఆలోపు ఆయన లేని సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. విద్యాబాలన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.

ఎన్టీఆర్‌ మూవీ అనగానే ఏయన్నార్‌ పాత్రను ఎవరు చేస్తారా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ పాత్ర విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇక మహానటి పాత్రను కీర్తి సురేష్‌ పోషించనుండగా, కృష్ణ పాత్రలో మహేష్‌బాబు కనిపించబోతున్నాడు. ఇంకా ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కూడా కనిపిస్తారని తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. బాలయ్య డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. క్రిష్‌ ఈ చిత్రంను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు.