బాబు ఆదేశాన్ని పట్టించుకోని మంత్రులు     2016-12-27   03:45:48  IST  Bhanu C

`తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నా.. రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం వాట‌న్నింటినీ భ‌రించ‌క తప్ప‌దు` అని సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్నారు. ఆయ‌న మాట‌పై న‌మ్మ‌కంతోనే ఉద్యోగులు వెల‌గ‌పూడిలోని తాత్కాలిక స‌చివాలయానికి త‌ర‌లివెళ్లారు. అయితే మంత్రులు మాత్రం ఆ స‌చివాల‌యంలో త‌మ‌కు సౌక‌ర్యాలు అర‌కొర‌గా ఉన్నాయ‌ని విమ‌ర్శిస్తున్నారు. దీంతో వారు త‌మ కార్యాల‌యాల‌కు రావ‌డ‌మే మానేశారు. అటు మంత్రులు రాక‌పోవడంతో అధికారులు కూడా గైర్హాజ‌రు అవుతున్నారు. దీంతో సామాన్యుల‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు!

వెలగపూడిలోని సచివాలయంలో గ‌ల మంత్రుల ఛాంబర్లు ఖాళీగా దర్శ‌న‌మిస్తున్నాయి. విజయవాడలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిరోజూ సచివాలయానికి వస్తున్నారు. కానీ మంత్రులు మాత్రం అటువైపు చూడ‌ట‌మే లేదు. ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను మంత్రుల‌కు విన్న‌వించుకునేందుకు సచివాల‌యానికి వ‌స్తూ ఉంటారు. వారి కోసం మంత్రులు అందుబాటులో ఉండాలని ప్రతి శుక్రవారం సచివాల‌యానికి త‌ప్ప‌నిస‌రిగా రావాల‌ని చంద్రబాబు గతంలోనే ఆదేశించారు. కానీ ఆ మాట‌ను మంత్రులు బేఖాత‌రు చేస్తున్నారు. దీనికి కార‌ణం కూడా లేక‌పోలేద‌ట‌.

మంత్రులంద‌రికీ ఛాంబర్లు కేటాయించినప్పటికీ శుక్రవారం అరకొరగా వస్తున్నారు. మంత్రివర్గ ఉప సంఘ సమావేశాలు – ఇతర సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే శుక్రవారం వస్తున్నారు. దీంతో మంత్రులు ఎప్పుడు వస్తారో తెలియక సందర్శకులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వస్తారని ఎదురుచూసి వెనుదిరగాల్సి వస్తోంది. సచివాలయానికి మంత్రులు ఎప్పుడు వస్తారో తెలియకపోవడంతోపాటు విభాగాధిపతుల కార్యాలయాలు పలు ప్రాంతాల్లో ఉండటం కూడా సందర్శకులను ఇక్కట్లకు గురిచేస్తోంది.

ఇటీవల విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో వారంలో రెండ్రోజులు సచివాలయంలో మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.అయినా కొందరు మంత్రులు మాత్రం గురు – శుక్రవారాల్లో ఉంటామని.. సోమవారం తమకు వీలుకాదని చెబుతున్నారట.